వైసీపీకి ఆ కీలక సామాజికవర్గం నేతలంతా దూరం.. దూరం

ఎన్నికల అనంతరం పెద్దగా మార్పులేకున్నా ఏపీలో రాజకీయ పరిణామాలు వరుసగా మారుతున్నాయి.

Update: 2024-08-09 19:30 GMT

ఎన్నికల అనంతరం పెద్దగా మార్పులేకున్నా ఏపీలో రాజకీయ పరిణామాలు వరుసగా మారుతున్నాయి. లేదు లేదంటూనే పార్టీల్లో జంపింగ్ లు సాగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీకి ఎమ్మెల్యేల్లో ఎవరూ పార్టీ మారే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ, కీలక నేతలు మాత్రం చేజారిపోతున్నారు. ఆ పార్టీ గెలిచింది 11 అసెంబ్లీ సీట్లే. అధినేత జగన్ ను మినహాయిస్తే 10 మందిలో పార్టీ మారే వారు తక్కువేనని చెప్పొచ్చు. ఇక నాయకుల పరంగా చూస్తే చాలామంది ముఖ్యమైన వారు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

గుంటూరు నుంచి తూ.గో. వరకు..

వైసీపీ కొన్ని రోజుల్లోనే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా ఉమ్మడి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లాల నుంచి నాయకుల వసల వైసీపీకి ఇబ్బందికరమే. కాగా, తాజాగా పార్టీని వీడిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (ఏలూరు)కి జగన్ తొలి మంత్రివర్గంలోనే ప్రాధాన్యం దక్కింది. సీనియర్ అయిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా నుంచి కిలారి రోశయ్య, తూర్పు గోదావరి నుంచి పెండెం దొరబాబు లు వెళ్లిపోయారు. ఈ ముగ్గురివీ ఒకే సామాజిక వర్గాలు.

వైసీపీకి వారు దూరమేనా..?

ఏపీలో ప్రధాన సామాజికవర్గం కాపులు. దాదాపు 20 శాతం వరకు ఉంటారని చెబుతుంటారు. 2019లో వీరంతా వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచారు. అప్పటికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పుంజుకోవకపోవడంతో వారికి నమ్మకం కుదరలేదు. కానీ, గత ఎన్నికల నాటికి జనసేన ప్రభావవంతంగా మారడం టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి కట్టడంతో కాపులంతా జనసేన, కూటమిని ఆదరించారు. రాయలసీమలోనూ బలిజలు కూటమికి పట్టం కట్టారు. ఒక వర్గం ఓట్లు వేస్తేనే అధికారం వస్తుందని కాదు కానీ.. ఈ వర్గం ఆసాంతం ఓట్లు వేయడం ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక వైసీపీ పాలనలో ఉండగా కాపులకు రిజర్వేషన్ అసాధ్యమని జగన్ చెప్పేశారు. ఆపై ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనాని పవన్ కల్యాణ్ ను తేలిగ్గా తీసిపారేశారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి మారిపోవడం.. జనసేన బలపడడంతో కాపు నాయకులంతా ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా వైసీపీకి వీరంతా దూరమవుతుండడం దీనినే సూచిస్తోంది.

Tags:    

Similar News