కేసీఆర్‌కు అర్జంటుగా కేటీఆర్ అరెస్ట్ కావాలా..!

స్వయానా కేసీఆర్, కేటీఆర్ వైఖరిపై సొంత పార్టీ బీఆర్ఎస్ నేతల నుంచే ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-11-15 10:30 GMT

పదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోవడాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నదా..? అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన పది రోజుల నుంచే కేసీఆర్, కేటీఆర్ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. ఎప్పుడైనా కూలిపోవచ్చు.. అని కామెంట్స్ చేస్తున్నారా..? 11 నెలలైనా ప్రభుత్వం ఢోకా లేకుండా కొనసాగుతుండడాన్ని వీరు తట్టుకోలేకపోతున్నారా..? అందుకే వారిలో రోజురోజుకూ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నదా..? అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా గూండా రాజకీయాలకు తెరలేపారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. స్వయానా కేసీఆర్, కేటీఆర్ వైఖరిపై సొంత పార్టీ బీఆర్ఎస్ నేతల నుంచే ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. కానీ.. ఆయన అక్కడి నుంచే రాజకీయాలు నడుపుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన డైరెక్షన్‌లోనే కేటీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తున్నారనడంలోనూ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచే ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైన కత్తులు నూరుతున్నారన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అందుకే.. ఎప్పుడు ఏ ఛాన్స్ దొరుకుతుందా అని కాచుకు కూర్చున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్నది. కానీ.. బీఆర్ఎస్ మాత్రం నిత్యం ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌కు మోకాలడ్డుతూనే ఉన్నది. ఇక ఇటీవల రైతు రుణమాఫీ సందర్భంలోనూ అలాంటి రాజకీయాలనే నెరిపింది. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలైన రైతులను పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ఆ కార్యక్రమాలు కూడా పెద్దగా బీఆర్ఎస్‌కు మైలేజీ తీసుకురాలేదు. ఇక.. మూసీ సుందరీకరణ అంశంలోనూ కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నమే చేసింది. కేటీఆర్, హరీశ్ ఇద్దరూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై అటాక్ చేశారు. కానీ.. చివరకు మూసీ సుందరీకరణ అంశాన్ని బీఆర్ఎస్ హయాంలోనే తీసుకొచ్చారనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టింది. దాంతో ఆ అంశంలోనూ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది.

హైడ్రా విషయంలోనూ పలువురు బాధితులను పట్టుకొని రాజకీయం చేయాలని చూశారు. బాధితులను బీఆర్ఎస్ భవన్‌కు సైతం పిలుచుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు, నిరసనలకు ప్లాన్ చేశారు. చివరకు బాధితుల ఇళ్లకు సైతం వెళ్లి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. తాము ఇంతవరకు పేదల ఇళ్లను కూల్చలేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ కూడా నివేదికను వెల్లడించారు. కేవలం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న కట్టడాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు వెల్లడించారు. సో... హైడ్రా విషయంలోనూ బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం ఉంది.

ఇక... ఇటీవల అధికారులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కొత్త ప్లాన్ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీకి భూ సేకరణ నిమిత్తం పూనుకున్నారు. అయితే.. ఇదే విషయమై భూ సేకరణ కోసం బాధితులకు మాట్లాడేందుకు వెళ్లారు. లగచర్ల గ్రామానికి చేరుకున్న అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. అంతేకాదు.. వారి మీద దాడికి యత్నించారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు. ఏకంగా కలెక్టర్ మీదనే దాడికి యత్నించడమే కాకుండా మిగితా అధికారులనూ హత్యాయత్నానికి ప్రయత్నించారని ప్రభుత్వం పెద్దలు అంటున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుంది.

ఇప్పటికే ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాడిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేశ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త కావడం.. అతనితో నరేందర్ రెడ్డి 82 సార్లు ఫోన్‌లో మాట్లాడడం పోలీసు విచారణలో వెల్లడైంది. మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరుచగా అతనిని రిమాండ్ చేశారు. అయితే.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును సైతం జత చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లుగా వారు రిపోర్టు ఇచ్చారు.

ఇప్పటికే ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణ జరుగుతోంది. రూ.55 కోట్లను ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే విదేశాలకు తరలించడంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఆ డబ్బులను రిలీజ్ చేశారు. దాంతో ఆ కేసు కేటీఆర్ మెడకు చుట్టుకోబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. ‘ఇక అప్పటి నుంచి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి..’ అంటూ కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా.. అధికారులపై దాడి విషయంలోనూ కేటీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. సో.. ఈ కేసులో కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో రెండు రోజులుగా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. బయటకు వచ్చాక తాను ఏం చేయాలో అది చేస్తా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు రెండురోజుల క్రితం బుధవారం రాత్రి పోలీసుల నుంచి అరెస్ట్ సమాచారం ఏం లేకపోయినప్పటికీ.. కేటీఆర్ నానా హంగామా చేశారు. అరెస్ట్ చేస్తున్నారని బయటకు లీకులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు నందినగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో కేటీఆర్ భేటీ అవుతూనే ఉన్నారు.

అయితే.. ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్‌లోనూ జరుగుతున్నట్లు పార్టీలో ప్రచారం వినిపిస్తు్న్నది. ఉమ్మడి జిల్లాల వారీగా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే చేపట్టాల్సిన నిరసనలపై దిశ దశ చేశారు. ఉద్యమం కాలంలో ఏ విధంగా అయితే ఆందోళనలు చేశామో.. అంతకుమించి మండలాలు, నియోజకవర్గాల వారీగా నిరసనలు తెలపాలని సూచించారు. ఎక్కడ కూడా తగ్గకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేశారు.

ఇదిలా ఉండగా.. గత 11 నెలలుగా కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారు. దాంతో ఆయన ఇప్పటివరకు బయటకు రావడం లేదు. అయితే.. వచ్చే జనవరిలో ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చేందుకే కేసీఆర్ ఇన్ని రోజులు ప్రజల్లోకి రాలేదని పార్టీ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొలువుదీరి ఏడాది పూర్తికానుండడంతో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు కేసీఆర్ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అది చేయలేదు.. ఇది చేయలేదు అని నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే.. కేసీఆర్ ఈ సందర్భంలో ప్రజల్లోకి వచ్చినా ఆయనను పెద్దగా నమ్ముతారా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఆ వాతావరణం కూడా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అందుకే ఓ బలమైన సెంటిమెంట్ కోసం కేసీఆర్ చూస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే కేటీఆర్ ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అందుకే అధికారులపై దాడులకు ఉసిగొలిపారన్న ప్రచారం ఉంది. అంతేకాదు కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేసేందుకు నిత్యం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతూనే ఉన్నారు.

అటు ఇంటర్వ్యూలలోనూ ఏం చేస్తారో చేసుకోండి.. అరెస్ట్ చేస్తారో చేసుకోండి.. ఏం కేసు పెడుతారో పెట్టుకోండి.. అంటూ సవాళ్లు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. కలెక్టర్‌పై దాడికి పంపించి ఆ కేసులోనైనా తనను అరెస్ట్ చేస్తారేమోనని చూస్తున్నారు. కేటీఆర్ అరెస్టును వాడుకొని కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మరోసారి సెంటిమెంటును బలంగా తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఆరు నెలలపాటు జైలులో పెట్టారు. ఆ అంశాన్ని, ఇటు కేటీఆర్ అరెస్టును బలంగా వాడుకొని ప్రజల్లో సెంటిమెంట్ తీసుకురావాలని కేసీఆర్ ఆలోచన అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News