కేసీఆర్, ఈటల, రేవంత్.. ఎవరో ఒకరు ఓడాల్సిందే?
అయితే, ఇక్కడో విషయం చెప్పాల్సిందేమంటే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఓటమి పాలు కావడం ఖాయం. అదెలాఅంటే..
తెలంగాణ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి హోరెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్ లో ఊపు తెచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీని ఎలాగైనా గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం నుంచి అవమానకరంగా ఉద్వాసనకు గురై.. తాడోపేడో లాంటి ఉప ఎన్నికలో అద్భుత విజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ బండిని లాగుకొస్తున్నారు. అయితే, ఇక్కడో విషయం చెప్పాల్సిందేమంటే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఓటమి పాలు కావడం ఖాయం. అదెలాఅంటే..
తలా రెండుచోట్ల
తమ తమ పార్టీలకు రాష్ట్రంలో కీలక నేతలుగా ఉన్న కేసీఆర్, ఈటల, రేవంత్.. ఈ ఎన్నికల్లో రెండేసి స్థానాల నుంచి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర నాయకులు బహుశా ఎన్నడూ ఇలా ఒకే ఎన్నికలో రెండేసి సీట్లలో పోటీ చేసి ఉండరు. ఇక్కడే ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. అదేమంటే.. వీరు ముగ్గురూ ఎంచుకున్న సీట్లు. వాస్తవానికి సీఎం కేసీఆర్ గత రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేసి నెగ్గుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ లోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో గెలిచి 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక ఈ ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ గజ్వేల్ తో పాటు అనూహ్యంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. దీనివెనుక మర్మం ఏమిటో ఇంతవరకు స్పష్టం కాలేదు. అసలు ఎన్నడూ రెండు అసెంబ్లీ సీట్లకు పోటీ చేయని కేసీఆర్ ఈ సారి మాత్రమే రెండు సీట్లలో బరిలో దిగడం ఎందుకనేది అందరి మెదళ్లను తొలుస్తోంది. కేసీఆర్ 2004లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ సీటును వదులుకున్నారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీచేసి నెగ్గారు. 2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎంపీకి రాజీనామా చేశారు. అంటే ఆయన రెండుసార్లు పోటీ చేసిన రెండు సందర్భాల్లోనూ ఒకటి ఎంపీ సీటు అన్నమాట.
రేవంత్, ఈటల జిల్లాలు దాటి..
కేసీఆర్ ను ఎలాగైన ఓడించాలన్న పట్టుదలతో ఉన్న ఈటల, రేవంత్ ఆయనతో నేరుగా ఢీకొనేందుకు సిద్ధమయ్యారు. గజ్వేల్ లో సొంత సామాజికవర్గం ముదిరాజ్ ల అండతో కేసీఆర్ ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు ఈటల. ఇక రెడ్ల ప్రభావం ఉంటుందని చెబుతున్న కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించేందుకు రేవంత్ సై అంటున్నారు. విచిత్రం ఏమంటే వీరిద్దరూ జాతీయ పార్టీల రాష్ట్ర నాయకులు. రెండేసి సీట్లలో పోటీ చేయాలంటే ఆ పార్టీల హైకమాండ్ అనుమంతి ఉండాలి. ప్రతిష్ఠాత్మక ఎన్నికలు కావడంతో వారి వారి పార్టీల అగ్ర నాయకత్వం ఈటల, రేవంత్ కు రెండేసి సీట్లలో పోటీకి పచ్చజెండాలు ఊపాయి. రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను, ఈటల ఉమ్మడి కరీంనగర్ ను దాటి బయటకు వచ్చి తొలిసారి పోటీ చేస్తున్నారు.
ఒకరికి ఒకచోటైనా ఓటమి పక్కా
ముగ్గురు అగ్ర నాయకులు రెండేసి సీట్లలో పోటీచేసినా.. కనీసం ఒకరైనా ఒక సీటులో ఓడిపోవడం పక్కా. రేవంత్ కామారెడ్డిలో గెలిస్తే.. కేసీఆర్ ఒకచోట ఓడినట్లు. గజ్వేల్ లో ఈటల ఓడిపోతే ఆయన ఖాతాలోనూ ఓ ఓటమి ఉంటుంది. ఇక రేవంత్ .. కామారెడ్డిలో ఓడితే ఆయన కూడా ఒక సీటును కోల్పోయినట్లే. ఇలా కాకుండా కేసీఆర్.. గజ్వేల్, కామారెడ్డిలోనూ గెలిస్తే. ఆయన రెండు విజయాలు సాధించినట్లు అవుతుంది. మొత్తానికి ముగ్గురిలో ఒకరికైనా ఒకచోట ఓటమి ఖాయం అన్నమాట.