కేసీఆర్ ప్లానింగ్.. బీఆర్ఎస్ కాస్తా టీఆర్ఎస్ కానుందా?

ఆ మాటకు వస్తే.. తనకు మించిన మేధావి.. వ్యూహకర్త మరొకరు ఉండరన్న బలమైన నమ్మకం గులాబీ బాస్ లో ఎక్కువని చెబుతారు.

Update: 2023-12-22 03:57 GMT

గెలుపు మీద ధీమా ఉన్న వేళ.. తాము చేస్తున్న తప్పుల్ని గుర్తించేందుకు పెద్ద ఇష్టపడరు. అందుకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం మినహాయింపుకాదు. ఆ మాటకు వస్తే.. తనకు మించిన మేధావి.. వ్యూహకర్త మరొకరు ఉండరన్న బలమైన నమ్మకం గులాబీ బాస్ లో ఎక్కువని చెబుతారు. ఈ కారణంతోనే ఈ మధ్యన ముగిసిన ఎన్నికల్లో 90 సీట్లకు తగ్గవన్న అంచనాల్ని ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. ఎవరైనా అది కష్టమన్న మాట చెబితే.. వారిని దూరం పెట్టిన పరిస్థితి.

ఎన్నికల ఫలితాలువెలువడటం.. తాము చెప్పుకున్న తొంభై సీట్ల సంగతి తర్వాత.. కీలకమైన పోలింగ్ ముందు నాటికి 75కు తగ్గవన్న సీట్లు కూడా రాకుండా కేవలం 39 సీట్లకు పరిమితం కావటం తెలిసిందే. అంటే తాను అంచనా వేసుకున్న సీట్లలో సగం కంటే ఒక్క సీటు మాత్రమే అదనంగా వచ్చింది. ఈ ఫలితాల షాక్ తో గులాబీ బాస్ తో పాటు.. ఆయన పరివారానికి దిమ్మ తిరిగిపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ కు వచ్చిన 39 సీట్లలో దాదాపు 15 సీట్లు గ్రేటర్ పరిస్థితిలో రాకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నది తెలిసిందే.

ఇలాంటివేళ.. బీఆర్ఎస్ బాస్ చేసిన తప్పులు.. తీసుకున్న నిర్ణయాల్లోని లోపాల్ని కేసీఆర్ ఎదుట ప్రస్తావించే సాహసానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సాగుతున్న చర్చలు గులాబీ బాస్ మీద తీవ్ర ప్రభావాన్నిచూపుతున్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ మధ్యన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన పేరును మళ్లీ పాత పేరుకు వెళ్లేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

తన పరిధి.. బలం ఉన్న తెలంగాణను దాటేసి.. దేశం మొత్తాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పేరుగా మార్చేయటం పార్టీకి పెద్ద మైనస్ గా మారిందన్నమాట పలువురి నోట వినిపిస్తోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి పార్టీకి ఎదురుదెబ్బలు తగలటమే కాదు.. పవర్ చేజారిన విషయాన్ని కేసీఆర్ సైతం గుర్తించినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న రోజుల్లో ఇప్పుడున్న బీఆర్ఎస్ స్థానే టీఆర్ఎస్ గా మార్చటం ద్వారా పూర్వ వైభవం ఖాయమంటున్న వాదనకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. త్వరలోనే బీఆర్ఎస్ కాస్తా మరోసారి టీఆర్ఎస్ గా మారటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News