ఆ స్టేట్ ని టార్గెట్ చేసిన మోడీ !

ఇక తెలంగాణాలోని పార్టీ నేతలతో సంబంధించి నిర్వహించిన సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

Update: 2024-11-27 23:30 GMT

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం గా ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం జరపడమే ఇందుకు నిదర్శనం. ఈ సందర్భంగా తెలంగాణాలో బీజేపీ గెలిచి తీరాలని మోడీ వారికి సూచించినట్లుగా చెబుతున్నారు.

బీజేపీ తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది అని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అందుకోవాల్సిందే అన్నారు. ప్రజలు బీజేపీ మీద ఆశలు పెట్టుకున్నారని మోడీ వారితో వివరించారు. బీజేపీని పటిష్టం చేసే కార్యక్రమాలను శ్రీకారం చుట్టాలని కోరారు.

తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మోడీ అన్నట్లు తెలిసింది. అదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు మరచిపోలేకపోతున్నారు అని ఆయన చెప్పారు.

తెలంగాణాలో అసలు సిసలు రాజకీయ పక్షంగా ఆల్టరేషన్ గా బీజేపీ ఉందని అన్నారు. బీజేపీని గెలిపించేలా పార్టీ నేతలు అంతా పనిచేయాలని ఆయన కోరారు అంటున్నారు. ఇక తెలంగాణాలోని పార్టీ నేతలతో సంబంధించి నిర్వహించిన సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన గొంతుని గట్టిగా వినిపిస్తూనే ఉండాలని, బీజేపీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉండాలని ఎక్స్ లో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రధానితో భేటీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్ సహా ఇతర కీలక నేతలు అంతా పాల్గొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మహారాష్ట్రలో సాధించిన ఘన విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. దాంతో తెలంగాణాను ఈసారి గెలిచి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దక్షిణాదిన రెండేళ్ల క్రితం బీజేపీకి కర్ణాటక రాష్ట్రం ఉంది.

అయితే అక్కడ కాంగ్రెస్ విజయపతాకాన్ని ఎగరేసింది. ఇక ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. తెలంగాణాలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. దాంతో పార్టీ ఇక విస్తరించాల్సింది అధికారం పట్టాల్సింది ఈ స్టేట్ లోనే అని కమలనాధులు డిసైడ్ అయ్యారు అని అంటున్నారు. ఈ కారణంతోనే ప్రత్యేకంగా పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మోడీ వారికి దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు.

జమిలి ఎన్నికలు ఎపుడు వచ్చినా తెలంగాణాలో బీజేపీ ఎంపీలను డబుల్ చేసుకోవాలన్న లక్ష్యంతో పార్టీ ఉందని అంటున్నారు. బీజేపీకి బేస్ ఉంది. అయితే అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువగా ఉంది. రూరల్ సెక్టార్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్యనే పోటీ ఈ రోజుకీ ఉంది.

అయితే ఈ రెండు పార్టీలతో విసిగిన వారిని తమ వైపు తిప్పుకుని పార్టీని పటిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. కాంగ్రెస్ కి ఉన్న కీలక రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి కావడంతో అక్కడ బీజేపీ జెండా పాతాలని కూడా కాషాయం పెద్దలు భావిస్తున్నారు.

తెలంగాణాకు పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఘన విజయం సాధించడం ఉపయోగపడుతుందని అంటున్నారు. అక్కడికి కూడా తెలంగాణా నుంచి వలస వెళ్ళిన ప్రజలు తాజా ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు అని అంటున్నారు. దాంతో తెలంగాణా ప్రజల ఆలోచనలు కూడా కమలానికి అనుకూలంగా ఉంటాయని లెక్క వేస్తున్నారు.

Tags:    

Similar News