ఇది కేసీఆర్ ఆయనకు ఆయన ఇచ్చుకున్న రిటర్న్ గిఫ్ట్?

బీఆర్ఎస్ కు వందమంది వరకు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామందిపై తీవ్ర స్థాయి అభియోగాలున్నాయి

Update: 2023-12-03 16:30 GMT

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి.. దక్షిణాదిలో ఆ రికార్డు దక్కించుకున్న సీఎంగా చరిత్రలో నిలవాలన్న కేసీఆర్ కల చెదిరింది.. వరుసగా మూడోసారి గెలుపు సాధ్యమా? కాదా? అనేది పక్కనపెడితే.. ఓ రకంగా కేసీఆర్ ఆయనకు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకున్నట్లు చెప్పాలి. వాస్తవానికి ఇండియా టుడే సర్వేలో సీఎంగా ఎవరు ఉండాలి అనే పాయింట్ కు 32 శాతం ప్రజలు కేసీఆర్ వైపే నిలిచారు. రేవంత్ రెడ్డిని 21 శాతం మంది ఎంచుకున్నారు. అంటే.. సీఎం కేసీఆర్ అనే విషయంలో మూడొంతుల మంది ప్రజలకు ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. మరి ఎక్కడ కొట్టింది తేడా..?

ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..

బీఆర్ఎస్ కు వందమంది వరకు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామందిపై తీవ్ర స్థాయి అభియోగాలున్నాయి. కనీసం జిల్లాకు ఒకరిపైన అయినా ఇలాంటి రావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మంలో వనమా వెంకటేశ్వరావు, ఆదిలాబాద్ లో దుర్గం చిన్నయ్య, వరంగల్ లో ముత్తిరెడ్డి.. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్క చాలా ఉంది. కానీ, ఇలాంటి వారిలో చాలామందికి టికెట్లు ఇచ్చారు కేసీఆర్. మరికొందరు మంచివారు ఉన్నప్పటికీ చెడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది కదా?

రిటర్న్ గిఫ్ట్ సొంతంగా

2018 ఎన్నికల్లో ముందుస్తుకు వెళ్లి మరీ గెలుపు సాధించారు కేసీఆర్. అది ఒకరకంగా సాహసోపేతం. అందులోనూ మహా కూటమి (టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు)ని ఢీకొట్టి మరీ విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నాడు కాంగ్రెస్ తో జట్టు కట్టి తన ఓటమికి ప్రయత్నించారని.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. ఈ మాట సోషల్ మీడియా, మీడియాలో చాలా పాపులర్ అయింది. దీనికితగ్గట్లే 2019లో కేసీఆర్ ఏపీలో వైసీపీ చీఫ్ జగన్ కు మద్దతుగా నిలిచారని చెబుతారు. దీంతోనే జగన్ అద్భుత విజయం సాధించారని పేర్కొంటున్నారు.

ఇప్పుడేమంటారు..?

2019లో జగన్ విజయంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత ఇద్దరు సీఎంలూ చెట్టాపట్టాలేసుకుని నిర్ణయాలు తీసుకున్నారు. నీటి ప్రాజెక్టులు సహా చాలా విషయాల్లో ఇద్దరూ సమన్వయంతో నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, తాజా ఎన్నికల్లో పరాజయంలో కేసీఆర్ మరికొన్ని నిర్ణయాలూ పాత్ర పోషించాయి. కాళేశ్వరం కుంగడం, నిరుద్యోగుల ఆత్మహత్యలు, పథకాలు చేరకపోవడం, రాజకీయ డ్రామాలు పారకపోవడం వంటివి ఇందులో కొన్ని. కాలం కలిసిరాక.. కీలక నాయకులను వదులుకోవడమూ బీఆర్ఎస్ ను దెబ్బతీసింది అని చెప్పొచ్చు.

చంద్రబాబు వెంట నిలవక

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు విషయాన్నే తీసుకుంటే.. హైదరాబాద్ లో అత్యధికంగా ఉండే ఐటీ ఉద్యోగులు ధర్నాకు దిగడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుబట్టింది. చంద్రబాబు అరెస్టు సరైనదా? కాదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. బీఆర్ఎస్ మౌనంగా ఉంటే సరిపోయేది. అప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముప్పును గ్రహించి చంద్రబాబు పక్షాన నోరు విప్పారు. కానీ, అధిష్ఠానం ఉద్దేశం మాత్రం వేరేగా ఉంది.

కొసమెరుపు: 2018 ఎన్నికల అనంతరం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఆయన అరెస్టుపై అసలు నోరే మెదపలేదు. ఇప్పుడు మెదిపినా పట్టించుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చినందున అసలు ఆ అవసరం కూడా లేదు.

Tags:    

Similar News