బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయి!

అయితే ‘కాలం బాగోపోతే తాడే పామై కాటేసినట్టు’ కేసీఆర్‌ కు ఇప్పుడు అస్సలు పరిస్థితి బాలేదు.

Update: 2024-03-23 13:30 GMT

‘బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయి’ అనే సామెత బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అక్షరాలా అతికినట్టు సరిపోతుందని అంటున్నారు. తెలంగాణ తెచ్చినవాడిగా కీర్తిప్రతిష్టలు, వరుసగా రెండుసార్లు అధికారం, దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా వైభోగం, ఒకప్పుడు రాచకొండ రాజధానిగా తెలంగాణను పాలించిన వెలమ రాజు సర్వజ్ఞ సింగభూపాలుడులాగా రాచరికం కేసీఆర్‌ వెలగబోశారు.

అయితే ‘కాలం బాగోపోతే తాడే పామై కాటేసినట్టు’ కేసీఆర్‌ కు ఇప్పుడు అస్సలు పరిస్థితి బాలేదు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి, అన్నిటినీ మించి స్వయంగా కేసీఆరే ఎమ్మెల్యేగా కామారెడ్డిలో ఘోర పరాజయం, మరోవైపు కేసీఆర్‌ గారాలపట్టి కవితను ఈడీ అరెస్టు చేయడం, ఇంకోవైపు వరుసగా పార్టీని వీడిపోతున్న నేతలు.. ఇలా కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మరోవైపు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్‌ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్‌ రావు అనే సీఐని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఉన్న కీలక సూత్రధారులు, పాత్రధారులందరినీ అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారమంతా కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ కనుసన్నల్లోనే జరిగిందని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్‌ ఇళ్లల్లో పోలీసు అధికారులు సోదాలు చేస్తారని అంటున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత అరెస్టు కావడంతో దీనికి సంబంధించి కవిత బంధువులు ఇళ్లళ్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌ ఇళ్లళ్లోనూ సోదాలు చేస్తారని అంటున్నారు.

ఇప్పటికే కీలక నేతలు బీఆర్‌ఎస్‌ ను వీడి పోతున్నారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ లో చేరిపోయారు. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఆమె తండ్రి, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు సైతం నేడో, రేపో బీఆర్‌ఎస్‌ లో చేరతారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఇలా ఎంతో మంది నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. ఇక చోటా మోటా నేతల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు.

మరికొద్ది రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మినహా మిగతా వారంతా కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. రేవంత్‌ సై అనాలే కానీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లోకి వచ్చి పడటం ఖాయంగా కనిపిస్తోంది అని చెబుతున్నారు.

ఈ ఫిరాయింపులపై కేసీఆర్‌ నోరు కూడా మెదపలేరని అంటున్నారు. ఎందుకంటే గత పదేళ్లు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామందిని అడ్డగోలుగా కేసీఆర్‌ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సైతం ‘నువ్వు నేర్పిన విద్యయే నీరజా„ý ’ అన్నట్టు వ్యవహరిస్తోంది.

ఓవైపు అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో ఉనికి కోల్పోయి బీఆర్‌ఎస్‌ పతనం, కూతురు అరెస్టు, రేపోమాపో కేసీఆర్‌ తోపాటు కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టు అయ్యే దుస్థితి ఇలా.. అన్ని రకాలుగా తెలంగాణలో కేసీఆర్‌ దుకాణం మూతపడటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News