అలా చేయొచ్చా? ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు చేశారు ముస్లిం లాబోర్డు ఛైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమాన్

Update: 2024-01-16 06:28 GMT

సంచలన వ్యాఖ్యలు చేశారు ముస్లిం లాబోర్డు ఛైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమాన్. అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరో వారంలో జరుగుతున్న వేళ.. ఆయన నుంచి వెలువడిన ప్రకటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మోడీ సర్కారు అనుసరించే వైఖరిని ఆయన విభేదించొచ్చు. అంతమాత్రాన.. దేశంలో హిందు-ముస్లింల మధ్య నెలకొన్న సంబంధాల్ని దెబ్బ తీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది.

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ లౌకిక విధానానికి వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొనటం ఒక ఎత్తు అయితే.. ఆ కార్యక్రమంలో ముస్లింలు ఎవరూ పాల్గొనొద్దని పేర్కొనటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఆలయ ప్రారంభోత్సవంపై బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అనుసరిస్తునన వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలు రాజకీయ ప్రేరేపితమన్న ఆయన.. పాత సంగతుల్ని తవ్వి తీయటం గమనార్హం.

రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు తమ వారి మనసుల్ని గాయపరిచిందన్న ఆయన.. తాజాగా చేసిన ప్రకటనలో.. ''హిందూసోదరులకు మాత్రమే సంబంధించిన ఈ మతపరమైన కార్యక్రమంలో ముస్లింలు పాల్గొనొద్దు. రామ మందిర ప్రారంభోత్సవంపై ప్రభుత్వం.. మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రధాని రామ మందిరాన్ని ప్రారంభించటం న్యాయాన్ని.. లౌకికవాదాన్ని హత్య చేయటమే. జనవరి 22న దీపాలు వెలిగించండి. జై శ్రీరాం నినాదాలు ఇవ్వండని ప్రధాని పిలుపునివ్వటం.. రాజకీయ నినాదంగా మాత్రమే ముస్లింలు అర్థం చేసుకోవాలి'' అని పేర్కొన్నారు.

అయోద్య రామ మందిర నిర్మాణంపై హిందూ సోదరులు ఆనందంతో దీపాలు వెలిగించుకుంటే తమకు అభ్యంతరం లేదని.. ముస్లింలు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని పేర్కొనటం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలు గౌరవించినప్పటికీ అది వారి మనసుల్ని మాత్రం గాయపర్చినట్లుగా ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దేశంలో ఒక కార్యక్రమంలో పాల్గొనాలి? పాల్గొనకూడదు? అన్నది ఎవరికి వారు వారి వ్యక్తగత ఇష్టాయిష్టాలకు సంబంధించింది. అంతే తప్పించి.. ఒక మతానికి చెందిన పెద్దలుగా పేరున్న వారు ఈ తరహాలో చేసే ఆదేశాలు ఏ మాత్రం మంచివి కావన్నది మర్చిపోకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News