సరిహద్దులను దున్నేసి.. కయ్యానికి కాలుదువ్విన యమ ‘కిమ్’కరుడు

కొన్ని దశాబ్దాల కిందట దాకా ఒకటిగానే ఉన్న కొరియా ద్వీప కల్పం ఇప్పుడు ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది.

Update: 2024-10-14 09:17 GMT

దేశంలో వరదలు వచ్చినందుకు అధికారులను ఉరి తీసినా అతడే.. పొరుగు దేశంపైకి చెత్త బెలూన్లను వదిలి చిరాకు పెట్టినా అతడే.. అణు పరీక్షకు దిగినా అతడే.. కొవిడ్ రాకుండా సరిహద్దులను మూసేసినా అతడే.. ఇప్పుడు అతడు ఏకంగా సరిహద్దులను దున్నేస్తున్నాడు.. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇంకోవైపు ఇక్కడ యుద్ధం ప్రారంభ సూచన.. ఏం జరగబోతోందో?

కొరియా ద్వీపంలో కొరివి

కొన్ని దశాబ్దాల కిందట దాకా ఒకటిగానే ఉన్న కొరియా ద్వీప కల్పం ఇప్పుడు ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. దక్షిణ కొరియా ప్రజాస్వామ్య పాలనలో అద్భుతంగా డెవలప్ అయితే.. ఉత్తర కొరియా లెఫ్ట్ ఐడియాలజీ నియంతలు కిమ్ ల చేతుల్లోకి వెళ్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కయ్యం నడుస్తోంది. వీటిని విభజించేందుకు నిస్సైనిక (సైన్యం ఉండని) ప్రాంతం ఉంది. అయితే, తరచూ కయ్యానికి కాలు దువ్వడం ఉత్తర కొరియా నియంత కిమ్ కు అలవాటే. గతంలో ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడిన వేళ అమెరికా రంగంలోకి దిగింది.

ఇప్పుడు ఏం చేసిందంటే..?

దక్షిణ కొరియాతో కనెక్ట్ అయ్యే రోడ్లు, రైల్వే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తోంది. రవాణా మార్గాలను నాశనం చేస్తామని ఇప్పటికే ఆ దేశం హెచ్చరించింది. ఒకవేళ యుద్ధం జరిగితే.. దక్షిణ కొరియా దళాలు తమ దేశంలోకి రాకుండా ఉత్తర కొరియా ఈ పనిచేస్తోంది. ఇప్పటికే దక్షిణ కొరియా తమపైకి డ్రోన్లు పంపిస్తోందని కిమ్ మండిపడుతున్నారు. అందుకే కయ్యానికి సిద్ధమవుతున్నారు. భారీ కేమోఫ్లాజ్‌ లతో ఉత్తర కొరియా సైన్యం రోడ్ల ధ్వంసానికి దిగుతోంది.

డ్రోన్లు వచ్చినా సహించం..

దక్షిణ కొరియా డ్రోన్లు తమ గగనతలంలోకి వచ్చినా.. కరపత్రాలు జారవిడిచినా.. తాము దాడికి దిగుతామని ఉత్తరకొరియా హెచ్చరిస్తోంది. శతఘ్ని దళం సహా ఇతర కీలక యూనిట్లను సరిహద్దుల్లోకి పంపింది. ఉత్తర కొరియాలో బాగా బలమైన నాయకురాలైన నియంత కిమ్‌ చెల్లెలు కూడా హెచ్చరికలు చేసింది. ఇంత జరుగుతున్నా దక్షిణ కొరియా మాత్రం నోరు మెదపడం లేదు.

అవి చెత్త బెలూన్లు కాదు.. జీపీఎస్ బెలూన్లు

ఇప్పటివరకు టెక్నాలజీకి ఉత్తర కొరియా చాలా దూరం అని అందరూ అనుకున్నారు. దక్షిణ కొరియాపైకి చెత్త బెలూన్లు పంపితే ఇదేం చెత్త పని అని విమర్శించారు. కానీ, ఆ బెలూన్ల వెనక పెద్ద ప్రణాళికే ఉందట. ఆ బెలూన్లకు జీపీఎస్‌ పరికరాలను అమర్చినట్లు దక్షిణ కొరియా దళాలు గుర్తించాయి. ఈ ఏడాదిలోనే 4.44 లక్షల డాలర్ల ఖర్చుతో 6 వేల బెలూన్లను ఉత్తర కొరియా వదిలింది. ఇవన్నీ దక్షిణ కొరియా విమానాలకు ఇబ్బందులు తెచ్చాయి. సియోల్‌ విమానాశ్రయాల్లోని రన్‌ వేలను మూసేయాల్సి వచ్చింది. అయితే, దక్షిణ కొరియా కూడా ఏమీ తక్కువ తినలేదు. డ్రోన్లలో కరపత్రాలు ఉంచి ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ లో విడుస్తోంది. అందుకే కిమ్ కు అంత మంట. చివరకు సరిహద్దులను తవ్వేసి.. డ్రోన్లు కనిపించినా కాల్చేస్తాం అని హెచ్చరిస్తున్నది ఇందుకే.

Tags:    

Similar News