తెలంగాణాకు ఆరు లక్షల కోట్లన్న కిషన్ జీ !

తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం ఆరు లక్షల కోట్లను ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు

Update: 2024-07-25 01:30 GMT

తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం ఆరు లక్షల కోట్లను ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఆరు లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు, చాలా భారీ మొత్తంగానే ఉంది. మరి ఇంత పెద్ద మొత్తం కేంద్రం సాయం చేసినపుడు దానిని బీజేపీ నేతలు ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదు, ఆ విషయం జనాలకు ఎందుకు తెలియడం లేదు అన్నదే ప్రశ్నగా ఉంది.

ఇదిలా ఉంటే తెలంగాణాకు ఆరు లక్షల కోట్లు ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చింది అంటే అది గత పదేళ్లలో ఇచ్చిందా లేక గత అయిదేళ్ళలో ఇచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో ఆ ఆరు లోక్షల కోట్లు ఎపుడు ఇచ్చారు ఎలా ఇచ్చారూ ఏ రూపంలో ఇచ్చారు అన్న వివరాలు కేంద్ర మంత్రి చెబితే బాగుంటుందని అంటున్నారు.

మరి ఇన్ని లక్షల కోట్లు కేంద్రం ఇస్తే కనుక ఎవరికి లబ్ది చేకూరింది అన్నది కూడా తెలియాలి కదా అని అంటున్నారు. కేంద్ర మంత్రి నిజమే చెబుతున్నారు అని అంతా అనుకున్నా ఆ వివరాలు అన్నీ సమగ్రంగా చెబితేనే కానీ ఎవరూ నమ్మరు కదా అని అంటున్నారు.

ఫలానా దానికి ఇంత కేటాయించామని ఫలానా పనులకు ఈ మొత్తాలని ఇచ్చామని స్పష్టమైన లెక్క చెబితే ప్రజలు అర్ధం చేసుకుంటారు రాజకీయ పక్షాలు కూడా ఈ విషయంలో సంతృప్తి పడి కేంద్రం మీద దుమ్మెత్తి పోయడం మానుకుంటాయని అంటున్నారు.

గతంతో పోలిస్తే ప్రజలు చాలా తెలివిగా మారారని అంటున్నారు. వారు స్మార్ట్ ఫోన్ల వినియోగంతో బాగా స్మార్ట్ అయ్యారని అంటున్నారు. వారికి కళ్ల ముందు డేటా ఉండాలని అన్నీ వివరంగా కనిపించాలని అంటున్నారు. అపుడే వారు నమ్ముతారని కూడా అంటున్నారు.

అందువల్ల కేంద్ర మంత్రి పూర్తి వివరాలతో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబితే తెలంగాణా ప్రజలు ముందు సంతోషిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కిషన్ రెడ్డి ఒక విషయంలో తేల్చేసారు. అదేంటి అంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అక్కడ లభించే ఇనుము నాణ్యమైనది కాదని అందువల్ల కేవలం నష్టపోవడం కోసం ఫ్యాక్టరీ పెట్టలేమని కిషన్ రెడ్డి అంటున్నారు.

ఇక కిషన్ రెడ్డి రాజకీయంగా పదునైన ప్రకటనలే చేస్తున్నారు. తాను ఎవరికీ బానిసను కాదని పదవుల కోసం పార్టీలు మారే రకాన్ని అంతకంటే కాదని చెబుతున్నారు. ఇలా ప్రత్యర్ధులలో ఎవరికి ఏది తగలాలో వారి మీద విమర్శల రూపంలో బాణాలు వేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా తెలంగాణా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా కేంద్రం రాష్ట్రానికి ఏమి చేసింది అన్నది లెక్కలతో సహా కిషన్ రెడ్డి చెబితే తప్ప విపక్షాలు శాంతించేటట్లుగా కనిపించడంలేదు. ఆరు లక్షల కోట్ల రూపాయల వివరాలు కిషన్ రెడ్డి బయటపెట్టాల్సిందే అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News