రేపు తిరువూరులో కొలికపూడి వివరణ.. సర్వత్ర ఆసక్తి..
ఈ నేపథ్యంలో తిరువూరులో జరిగిన పరిణామాలపై కొలికపూడిని వివరణ ఇవ్వవలసిందిగా కోరారు.
తిరువూరు పంచాయితీ మెల్లిగా ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ వరకు వచ్చింది. వరుస ఫిర్యాదులు రావడంతో ఎంఎల్ఏ కొలికపూడి శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వివరణకు పిలిపించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసీనేని శివనాథ్ తదితరులు కొలికపూడితో జరుగుతున్న వివాదాలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో తిరువూరులో జరిగిన పరిణామాలపై కొలికపూడిని వివరణ ఇవ్వవలసిందిగా కోరారు.
మీడియా ప్రతినిధులను అగౌరవపరిచే విధంగా ఎమ్మెల్యే కొలికపూడి మాట్లాడారు అంటూ మీడియా ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కొలికపూడి తమను బెదిరించారు అంటూ కూడా కొన్ని ఆధారాలను సీఎంకు అందజేశారు. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంకు విన్నవించుకున్నారు. అయితే జరుగుతున్న విషయాలపై తనకు అవగాహన ఉంది అని చెప్పిన చంద్రబాబు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు.
మహిళా ఉద్యోగులకు వాట్సాప్ నెంబర్ లపై అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ కొలికపూడి వారిని వేధిస్తున్నారని.. అతని వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలు అధిష్టానం కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల తిరువూరు మండలంలోని చిట్టేలలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శనకు దిగారు. కొలికపూడి పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
అయితే కొలికపూడి మాత్రం.. నా పనితీరు వల్ల క్యాడర్లో ఇలాంటి లోపం ఏర్పడుతుందని నేను ఎప్పుడు భావించలేదు. సమస్యలు సరిదిద్దే బాధ్యత కూడా నాదే. పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం నాడు తిరువూరులో నేను కార్యకర్తలతో సమావేశం నిర్వహించి నా వల్ల తలెత్తిన ఇబ్బందులను సరి చేసుకుంటాను.. అని పార్టీ పెద్దలకు కొలికిపూడి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు తిరువూరులో ఏమి జరుగుతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.