నల్లగొండ సమరం : కోమటిరెడ్డి బ్రదర్స్ ఇమేజ్ కి పెను సవాల్...!

కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ. కాంగ్రెస్ కి గట్టి పట్టున్న జిల్లా నల్లగొండ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం పది సీట్లు ఉన్నాయి.

Update: 2023-11-21 17:30 GMT

కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ. కాంగ్రెస్ కి గట్టి పట్టున్న జిల్లా నల్లగొండ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం పది సీట్లు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఇక్కడ కంచుకోటను నిలబెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అయితే బీయారెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నుంచి కీలక నేతలను తమ వైపునకు తిప్పుకుంది.

ఇదిలా ఉంటే కోమటి రెడ్డి బ్రదర్స్ జిల్లాను శాసిస్తూ వస్తున్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటి రెడ్డి రాజమోహన్ రెడ్డి ఇద్దరూ పలు మార్లు ప్రజా క్షేత్రంలో గెలిచారు. తమ వర్గం వారిని కూడా వారు గెలిపించుకుని సత్తా చాటారు. ఇక 2018 ఎన్నికల్లో నల్లగొండ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయారు.

మునుగోడు నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆయన ఆ మధ్య రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే ఇక్కడ బీయారెస్ గెలిచింది. ఇపుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి తిరిగి చేరారు. అలాగే వెంకట రెడ్డి నల్లగొండ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములూ కాకుండా మరో నాలుగు నియోజకవర్గాలలో తమ వారికి టికెట్లు ఇప్పించుకున్నారు.

తమ వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు ఆలేరు, మందుల సామేల్ కు తుంగతుర్తి, వేముల వీరేశంకు నకిరేకల్, బీఎల్ఆర్‌కు మిర్యాలగూడలో టికెట్లు ఇప్పించుకుని కోమటిరెడ్డి సోదరులు పార్టీలో పై చేయిగా నిలిచారు. అదే విధంగా చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్,, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు ఇబ్రహీంపట్నం, జనగామ నియోజక వర్గాలలో బలమైన కేడర్ ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు.

అయితే ఈసారి మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పదికి పది సీట్లు ఈసారి ఎలాగైనా గెలవాలని కోమటి రెడ్డి బ్రదర్స్ మంచి పంతం మీద ఉన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా సీఎం సీటు మీద గురి పెట్టారు. పది సీట్లు కాకపోయినా కనీసంగా ఏడెనిమిది గెలిచినా కోమటి రెడ్డి వర్గానికి కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యమంత్రి పదవి వెంటనే రాకపోయినా కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా దక్కే వీలుంది. సీనియర్ నేతలుగా ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్ కి ఇప్పటిదాకా మంత్రి పదవి అందని పండు అయింది. దానికి కారణం జిల్లాలోని కీలక నేతలు అనేకమంది ఉండడమే. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ఇదే జిల్లాకు చెందిన వారు. ఆయన వైఎస్సార్ టైం లో మంత్రిగా పనిచేశారు. ఇక మరో సీనియర్ నేత కుందుర్తి జానారెడ్డి కూడా కాంగ్రెస్ గెలిస్తే మంత్రి కావడం ఖాయంగా వస్తోంది.

ఈసారి జానారెడ్డి పోటీ చేయడంలేదు కానీ ఉత్తం పోటీలో ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయం. అలాగే కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా కోమటి రెడ్డి బ్రదర్స్ తమ ఇమేజ్ కే సవాల్ గా ఎన్నికలను తీసుకుంటున్నారు. వారి ప్రాభావాన్ని తగ్గించి బీయారెస్ ని గెలిపించుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు పన్నుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News