‘కొండా’ వ్యాఖ్యలు.. ఏకమైన సినీ ఇండస్ట్రీ.. కాంగ్రెస్‌కు మరో డ్యామేజీ

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు చర్చకు దారితీశాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాజకీయ పార్టీలు, సినీ ఇండస్ట్రీ మధ్య యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-10-03 06:57 GMT

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు చర్చకు దారితీశాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాజకీయ పార్టీలు, సినీ ఇండస్ట్రీ మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీనంతటికి నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వినిపిస్తోంది.

నాగచైతన్య-సమంత విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కేటీఆర్‌‌ను విమర్శించే క్రమంలో సురేఖ హీరోయిన్ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మాట్లాడారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి వాడుకుంటున్నారని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. అయితే.. ఇదే క్రమంలో సమంతపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని మొత్తం ఆలోచనలో పడేశాయి.

దాంతో ముందుగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీనటుడు నాగార్జున స్పందించారు. మీ పార్టీల వ్యక్తిగత అంశాల్లోకి, రాజకీయాల్లోకి తమను లాగొద్దని కోరారు. అలాగే.. తనపై చేసిన విమర్శలకు సమంత కూడా రియాక్ట్ అయ్యారు. తన విడాకుల అంశంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఇద్దరం ఒప్పుకునే తాము విడాకులు పొందామని అన్నారు. అనంతరం నాగ చైతన్య కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే.. ఆయన సొంతంగా మెస్సేజ్ ఏం చేయనప్పటికీ.. నాగార్జున చేసిన మెస్సేజ్‌నే రీ ట్వీట్ చేశారు. ఇక.. నాగార్జున అమల కూడా చాలా సీరియస్ అయ్యారు. మంత్రిని మనిషివా.. పశువువా అనే కోణంలో సంభోదించారు.

ఇలా.. ఒక్కొక్కరిగా నిన్నటి నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు, ఇతర పెద్దలు స్పందిస్తూనే ఉన్నారు. చిరంజీవి, నాని కూడా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పుడు సురేఖ మాట్లాడిన తీరును విమర్శిస్తూ సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం తనదైన స్టైల్‌లో స్పందించి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు వినోదాన్ని పంచేందుకు కష్టపడుతున్న తమను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు.

ఇక.. ఇప్పటికే హైడ్రా రగడతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇమేజీ కాస్త డ్యామేజీ అయింది. హైడ్రా వల్ల పేదలకు ఎవరికీ నష్టం లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలా వరకు విమర్శలు ఆగలేదు. ముఖ్యంగా మూసీ నిర్వాసితుల నుంచి ఆ నిరసన మరింత ఎక్కువగా కనిపించింది. చివరకు పార్టీలను ఆశ్రయించి.. వారి మద్దతు కోరాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో హైడ్రా చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా మూసీ నిర్వాసితులను కలుస్తూ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బస్తీల్లో పర్యటించి వారికి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని చెప్పారు. హైడ్రా వివాదం ఇలా కొనసాగుతుండగానే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే రాజకీయ పార్టీలు, సినీ ఇండస్ట్రీ పెద్దలు ఖండించగా.. తాజాగా ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ క్రమంలో ప్రభుత్వం, పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News