లంచం కేసులో సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు జైలు శిక్ష!!
ఈ సమయంలో శిక్ష అనుభవించడానికి అక్టోబర్ 7న జైలుకు వెళ్లనున్నారని కథనాలొస్తున్నాయి.
అవినీతిని తీవ్రంగా పరిగణిస్తారనే పేరున్న సింగపూర్ లో అవినీతికి పాల్పడటం, న్యాయానికి ఆటంకం కలిగించడంతో భారత మూలాలున్న మాజీ రవాణామంత్రి ఎస్ ఈశ్వరన్ (62) నేరాన్ని అంగీకరించారని అంటున్నారు. దీంతో సింగపూర్ కోర్టు అతనికి ఏడాది పాటు (12 నెలలు) జైలు శిక్ష విధించింది.
అవును... అవినీతికి పాల్పడటంతో పాటు న్యాయానికి ఆటంకం కలిగించిన అభియోగాలపై నేరాన్ని అంగీకరించడంతో ఈశ్వరన్ కు సింగపూర్ కోర్టు 12 నెలల జైలు శిక్ష విధించింది. ఈశ్వరన్ పబ్లిక్ ఆఫీసులో ఉన్నప్పుడు $4,03,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు స్వీకరించడంతో పాటు న్యాయాన్ని అడ్డుకున్నందుకు నేరాన్ని అంగీకరించాడని అంటున్నారు.
సింగపూర్ హైకోర్టులో కేసును పర్యవేక్షించిన జస్టిస్ విన్సెంట్ హూంగ్.. మాజీ రవాణా మంత్రి నేరాలు, అధికార దుర్వినియోగం.. ప్రభుత్వ సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఇదే సమయంలో... 50 ఏళ్ల తర్వాత సింగపూర్ లో కోర్టులో విచారణకు గురైన తొలి రాజకీయ వ్యక్తి ఈశ్వరనే అని అంటున్నారు.
ఈ సమయంలో శిక్ష అనుభవించడానికి అక్టోబర్ 7న జైలుకు వెళ్లనున్నారని కథనాలొస్తున్నాయి. సింగపూర్ లో మరణశిక్ష ఖైదీలను ఉంచే చాంగీలోని జైలులో అతను తన శిక్షను అనుభవిస్తాడని.. అక్కడ జైలు గదుల్లో ఫ్యాన్లు ఉండవని.. చాలా మంది ఖైదీలు మంచాలకు బదులు గడ్డి చాపలపై పడుకుంటారని చెబుతున్నారు!