కేంద్రానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా ఖర్చు చేస్తుంది?
శనివారం 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సుమారు 50 లక్షల 65 వేల 345 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బడ్జెట్ లెక్కలు తయారు చేశారు.
బడ్జెట్ ఎంతో కీలకం.. అది ఒక కుటుంబానికైనా దేశానికైనా సరైన బడ్జెట్ ఉంటేనే పురోగతి ఉంటుంది. ఇక ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు బడ్జెట్ రూపొందించుకుంటాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభయ్యే ఆర్థిక సంవత్సరానికి సరిపోయేలా జమా ఖర్చులు ముందే లెక్కిస్తాయి. దీనికి తగ్గట్టే ఆర్థిక మంత్రులు బడ్జెట్ తయారు చేస్తారు. అయితే రాష్ట్రాలకు వచ్చేసరికి కేంద్ర డబ్బు సర్దుబాటు చేస్తుందని, రాష్ట్రం జిల్లా, స్థానిక సంస్థలకు నిధులు పంపిణీ చేస్తుందని అందరికీ తెలిసిందే.
మరి కేంద్రానికి డబ్బు ఎలా వస్తుంది. ఏటా తగినంత ఖర్చుల కోసం కరెన్సీ ఏమైనా ముద్రించేస్తుందా? అంటే కాదనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో కరెన్సీ ఉన్నప్పటికీ ఏటా అయ్యే ఖర్చుల కోసం ప్రజల నుంచి కొంత, ఇతర మార్గాల నుంచి మరికొంత డబ్బు సమకూర్చుకుంటారు. ఈ ఏడాది కూడా కేంద్రానికి డబ్బు ఎలా సమకూరుతుందో బడ్జెట్ లో పక్కాగా వివరించారు.
శనివారం 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సుమారు 50 లక్షల 65 వేల 345 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బడ్జెట్ లెక్కలు తయారు చేశారు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజానీకానికి భారీ ఊరట దక్కలా ఈ బడ్జెట్ ఉందంటూ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శలు ఉన్నప్పటికీ, రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అదేవిధంగా రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. దేశ భద్రతకు పెద్దపీట వేశారు. అయితే రూ. 50 లక్షల కోట్లతో రూపొందించిన బడ్జెట్ కు నిధులు ఎలా సమకూరుస్తారన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమగ్రంగా సమాధామిచ్చారు.
ఈ ఏడాది ఖర్చు చేసే మొత్తంలో ఎక్కువగా రుణాలపైనే ఆధారపడనున్నట్లు కేంద్ర బడ్జెట్ ద్వారా తెలియజేసింది. వివిధ రకాల రుణాల ద్వారా 24 శాతం నిధులు సమకూర్చుకోనుంది. అదేవిధంగా ప్రజలు చెల్లించే ఆదాయపు పన్ను ద్వారా ఈ సారి 22 శాతం సమకూరుతుందని లెక్కించింది. ఈ రెండూ కాకుండా కేంద్ర ఎక్సైజ్ పన్నుల నుంచి ఐదు శాతం, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా 18 శాతం, కార్పొరేషన్ పన్నుల ద్వారా 17 శాతం నిధులు రానున్నాయి. ఇక కస్టమ్స్ ద్వారా 4 శాతం, అప్పు కిందకు రాని క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి ఒక శాతం సమకూర్చుకోనుంది. ఇలా కేంద్రం తనకు కావాల్సిన రూ.50 లక్షల 65 వేల 345 కోట్లను ఈ ఏడాది రాబడతామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఇక ఈ బడ్జెట్ ద్వారా రక్షణ శాఖకు అత్యధికంగా రూ.4,91, 732 కోట్లు, ఆ తర్వాత గ్రామీణాభివృద్దికి రూ.2,66,817 కోట్లు కేటాయించారు. అంతర్గత భద్రత కోసం హోంశాఖకు రూ.2,66,817 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1,71,437 కోట్లు కేటాయించారు. ఇక విద్యారంగానికి రూ.1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.98,311 కోట్లు ఖర్చు చేయనున్నారు. పట్టణాభివృద్ది, ఐటీ, రంగాలకు దాదాపు 95 వేల కోట్లు, విద్యుత్ రంగానికి రూ.81 వేల కోట్లు, సంక్షేమానికి రూ.60 వేల కోట్లు చొప్పున నిధులు సమకూర్చనున్నారు.
ఇక కేంద్రం నిధుల వేటలో భాగంగా మళ్లీ అప్పులు చేయాలని నిర్ణయించడంతో ప్రజలపై తీవ్ర భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2023 మార్చి నాటికి మనదేశానికి రూ.155.8 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. తాజాగా తెచ్చే అప్పులతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.