గిగ్ వర్కర్లను కనికరించిన కేంద్రం
దేశంలో ఉన్న గ్రిగ్ వర్కర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తిస్తూ అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. అంతేకాకుండా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద వారికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నారు.
కేంద్ర బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు పలు వరాలు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా ఏ అండా లేని గిగ్ వర్కర్ల రక్షణకు ప్రత్యేకంగా పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది గ్రిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రిగ్ వర్కర్లకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇదే సమయంలో వీరి సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. లక్షల మంది ఉపాధి పొందుతున్న ఈ రంగానికి భద్రత లేదన్న ఆందోళనల నేపథ్యంలో గ్రిగ్ వర్కర్ల రక్షణకు కేంద్రం అండగా నిలిచింది.
జుమాటో, స్విగ్గీ వంటి డెలవరీ వర్క్ చేసే కార్మికులను గ్రిగ్ వర్కర్స్ గా చెబుతారు. వీరికి ప్రస్తుత చట్టాల ప్రకారం ఎలాంటి రక్షణ లేదు. వారి సంక్షేమానికి ఎలాంటి పథకాలు లేవు. ఎండ, వాన, చలి వంటివాటిని లెక్క చేయకుండా గ్రిగ్ వర్కర్స్ పనిచేస్తుంటారు. ముఖ్యంగా వీరి పని మొత్తం టూ వీలర్స్ పై తిరగడంపైనే ఆధార పడి ఉంటుంది. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాలతోపాటు ఇతర సంఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేదరికం, నిరుద్యోగం వల్ల భద్రత లేకపోయినా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో ఏటా గ్రిగ్ వర్కర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో వారి సంక్షేమానికి ఈ బడ్జెట్ లో తొలిసారి నిధులు కేటాయించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
దేశంలో ఉన్న గ్రిగ్ వర్కర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తిస్తూ అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. అంతేకాకుండా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద వారికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నారు.
అంతేకాకుండా ఈ-శ్రమ పోర్టల్ లో వారి పేర్లు నమోదు చేసుకోడానికి అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ప్లంబర్ల, ఎలక్ట్రీషియన్లు వంటి వారికే ఈ పోర్టల్ లో నమోదు చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం గ్రిగ్ వర్కర్లకు ఈ సౌకర్యం కల్పించడంతోపాటు ఓలా, జొమాటో, స్విగ్గీ, ఉబర్, అర్బన్ క్లాప్ వంటి ప్లాట్ ఫామ్స్ లో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వారికి లబ్ధి జరగనుంది. దీనివల్ల దాదాపు కోటి మందికి మేలు జరగనుంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్న గ్రిగ్ వర్కర్లకు కేంద్రం అండగా ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. కోట్లాది కుటుంబాలకు భరోసా కల్పించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశంలో ఈ-కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో కీలక భాగస్వాములుగా గ్రిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సరైన గుర్తింపు లేకపోవడం వల్ల చాలా మంది ఈ రంగాన్ని ఎంచుకోడానికి జంకుతున్నారు. ఇప్పుడు వీరిని కూడా అసంఘటిత రంగంలో గుర్తించడంతో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు వర్తించే అన్నిరకాల సదుపాయాలు సమకూరనున్నాయి.