మధ్య తరగతి పాలిట మహాలక్ష్మి.. నిర్మలమ్మ పై మీమ్స్ హల్ చల్

ఏఐ జనరేటెడ్ ఫొటోలను జత చేసి లక్ష్మీదేవి అలంకరణలో నిర్మలా సీతారామన్ ఉన్నట్లు పోస్టు చేస్తున్న ఫన్నీ మీమ్స్ అందరినీ నవ్విస్తున్నాయి.

Update: 2025-02-01 14:30 GMT

కేంద్ర ఆర్థిక బడ్జెట్ పై నెట్టింట మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్ పై రకరకాల జోకులు పేల్చుతున్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై ఎప్పుడూ నెట్టింట సరదా కామెంట్లు వినిపిస్తుంటాయి. వీటిని తాను కూడా సరదాగానే తీసుకుంటానని చెబుతుంటారు నిర్మలమ్మ. అయితే ఈ సారి బడ్జెట్ పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నిర్మలమ్మను పొగడ్తలతో ముంచెత్తుతుండగా, మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రధానంగా ఈ బడ్జెట్ లో వేతన జీవులపై అతిపెద్ద వరం కురిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పన్ను శ్లాబులను సవరించడంతోపాటు రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ అనే ప్రకటన చేయడంతో ఆమెను మధ్యతరగతి పాలిట మహాలక్ష్మిగా అభివర్ణిస్తూ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఫొటోలను జత చేసి లక్ష్మీదేవి అలంకరణలో నిర్మలా సీతారామన్ ఉన్నట్లు పోస్టు చేస్తున్న ఫన్నీ మీమ్స్ అందరినీ నవ్విస్తున్నాయి.

ఇదే సమయంలో సబ్ కా వికాస్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించినా, నెటిజన్లు మాత్రం అంగీకరించడం లేదు. దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా, ఒకే రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని విమర్శిస్తూ A ఫర్ ఆపిల్.. B ఫర్ బిహార్ అంటూ మీమ్స్ వదిలారు. ఈ బడ్జెట్ లో బిహార్ కు అధిక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దేశంలో బిహార్ ఒకటే రాష్ట్రం ఉందా? బిహార్ కు బోనంజా అంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బడ్జెట్ కు ముందు, తర్వాత కూడా పోస్టు చేసిన మీమ్స్ చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఏం క్రియేటివిటీ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొందరు సినిమా పాటలను వాడుతూ బడ్జెట్ పై స్పందిస్తుండగా, కొందరు సందర్భానికి తగ్గ క్యాప్షన్ తగిలించి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మీమ్స్ ద్వారా మధ్య తరగతి జనం ఆర్థిక మంత్రిని మహాలక్ష్మిని చేశారని అంతా నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News