గౌరవంగా మరణం...అక్కడ తొలి అడుగు!

Karnataka Government decision Humanitarian law

Update: 2025-02-01 21:30 GMT

జీవితంలో తొలి చివరి ప్రస్థానాలు చాలా కీలకమైనవి. అతి ముఖ్యమనవి. ప్రవేశం ఎంత ముఖ్యమో నిష్క్రమణ అంతే ముఖ్యం. ఒక మనిషి తన జీవితాన్ని ఈ రెండింటి మధ్యనే కొనసాగిస్తాడు. పుట్టుక చావుల మధ్య ఉన్న కాలమే ఒక మనిషి జీవితం. అయితే మనిషి పుట్టుక అతను చేతిలో లేదు. ఆ మాటకు వస్తే మరణమూ అతని చేతులలో లేదు.

అందుకే ఎంత గొప్పగా పుట్టినా మరణం అంత గొప్పగా చాలా మందికి ఉండదు, అయ్యో ఎలా బతికి ఎలా పొయాడు అని అనేక మంది విషయంలో అనుకునే మాట. కానీ మరణం కూడా గౌరవంగా ఉండాలని చాలా మంది ఆలోచిస్తారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ముందే చెప్పినట్లుగా మనిషి చేతిలో అది లేదు.

సరే ఏదో విధంగా చావు వచ్చి మనిషి పోతే అది కూడా ఒక రకమైన సమంజసమైన మరణం కిందనే లెక్క. కానీ అలా కాకుండా ఏళ్ళకు ఏళ్ళు మంచం పట్టేసి తాను ఏమిటో తనకే తెలియకుండా అచేతానవస్థలో ఉంటూ కేవలం సాంకేతికంగానే ప్రాణం ఉంది అన్న పరిస్థితి కూడా అనేక మందిలో ఉంది.

వారికి తెలియదు తాము జీవించి ఉన్నామో లేదో. కానీ వారి బంధువులకు తెలుస్తుంది వారి బాధలు ఏమిటో. మరి కొన్ని ఉదంతాలలో భయంకరమైన బాధలతో వ్యాధులతో సతమతం అవుతూ కోలుకోలేని రోగాలతో బాధపడుతున్న వారు తామే స్వయంగా మరణాన్ని ఆహ్వానిస్తారు. అలాంటి వారికి బతుకు కన్నా చావే మేలు అదే గౌరవం అన్నట్లుగా ఉంటుంది.

ఇపుడు అటువంటి వారి విషయంలో కారుణ్య మరణాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురై, చికిత్స అనంతరం కూడా కోలుకోవడం కూడా సాధ్యం కాని రోగుల విషయంలో ఈ కారుణ్య మరణాలకు ఈ విధంగా మానవతా దృక్పధంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వనున్నట్లుగా ఆయన చెప్పారు.

ఈ విధంగా కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో తగిన విధంగా పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఈ రకంగా చేసుకున్న దరఖాస్తులను వైద్యులతో సదరు రోగులకు పరీక్షలు చేయించిన మీదటనే అనుమతించడం జరుగుతుదని ఆయన తెలిపారు.

ఇక రెండు దశలలో కారుణ్య మరణాల సంబంధించిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఇక అంతిమంగా వాటిని న్యాయ స్థానం ముందు ఉంచి అక్కడ అనుమతి లభించిన తరువాతనే ఆ రోగి కోరికను తీర్చడం జరుగుతుందని అన్నారు.

ఇది దేశంలో తొలి అడుగుగా భావిస్తున్నారు. అయితే అందరికీ ఈ కారుణ్య మరణాలకు అనుమతి లభిస్తుందా అంటే దీనికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి మేరకు మాత్రమే ఇస్తారు. అలాగే వైద్యుల నుంచి పూర్తి నివేదిక కూడా దీనికి జోడీగా ఉండాల్సిందే. ఆ మీదట కోర్టు అనుమతించడం చివరి దశ.

ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో నిర్దిష్టమైన కారుణ్య మరణాల చట్టం అయితే లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగ విధానాలలో కారుణ్య నియామకాలను అమలు చేస్తున్నారు. ఇది సర్వీస్‌లో ఉన్నప్పుడు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం జీవనోపాధి కోసం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా సంపాదించే సభ్యుని మరణం వల్ల కలిగే కష్టాలను తగ్గించడానికి ఉపాధిని అందించడం దీని వల్ల సాధ్యపడుతుంది.

అయితే కొన్ని ఇతర దేశాలలో కారుణ్య మరణాలకు అనుమతి ఉంది. కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించిన దేశాలలో కెనడా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, కొలంబియా, న్యూజిలాండ్, స్పెయిన్ ఆస్ట్రేలియాలోని చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ రోగి యొక్క అనారోగ్యం తీవ్రతమానసిక సామర్థ్యం యొక్క నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేసి వివిధ నిబంధనలు అర్హత ప్రమాణాలతో కారుణ్య మరణాలకు అనుమతులు ఇస్తారు. మరి కర్ణాటక ఈ విషయంలో వేసిన మొదటి అడుగు దేశంలో ఏ మార్పులను తెస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News