రిటైరైన ఏడాదికి పోస్టింగ్! ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి కరుణ

తాజాగా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీవీని నియమించింది.;

Update: 2025-02-01 17:25 GMT
రిటైరైన ఏడాదికి పోస్టింగ్! ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి కరుణ

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం కరుణ చూపింది. ఇటీవల ఆయన సస్పెన్షన్ కాలాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీవీని నియమించింది.

గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సస్పెన్షన్లోనే ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం వరుస వరాలు ప్రకటిస్తోంది. గత ప్రభుత్వంలో కక్ష సాధింపులతో పోస్టింగ్ లేకుండానే గడిపిన ఏబీవీ కోర్టు ఉత్తర్వులతో రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీవీకి మేలు చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముందుగా ఆయనపై నమోదైన అభియోగాలను ఉపసంహరించుకోవడంతోపాటు, ఆయన సస్పెన్షన్ కాలం మొత్తం విధుల్లో ఉన్నట్లు పరిగణించాలని కొద్ది రోజుల క్రితం ఆదేశాలిచ్చింది. దీంతో ఐదేళ్ల పాటు పైసా కూడా వేతనం అందుకోని ఏబీవీకి మొత్తం ఆర్థిక ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇక తాజాగా స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆయన సేవలను మళ్లీ ఉపయోగించుకోనున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

గత ప్రభుత్వంలో ఏబీవీని రెండు సార్లు సస్పెండ్ చేశారు. ఒకసారి ఆయన కోర్టుకు వెళ్లి తిరిగి పోస్టింగ్ తెచ్చుకుంటే.. మరోసారి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పుతో ఊరట పొందారు. ఆయన రిటైర్మెంట్ సమయంలోనూ పోస్టింగ్ ఇవ్వకపోతే.. మళ్లీ కోర్టు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. ఇలా గత ప్రభుత్వంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న ఏబీవీ రిటైర్మెంట్ కు ఒక్కరోజు పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఆయనకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

Tags:    

Similar News