రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. విద్యారంగంపై మంత్రి లోకేశ్

విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను తయారు చేస్తున్నట్లు హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.;

Update: 2025-03-07 08:12 GMT

రాష్ట్ర విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని మానవనరులు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందిస్తున్నామని శాసనసభలో మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ పురోగతికి తీసుకుంటున్న చర్యలను ఆయన సభలో వివరించారు. విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువు తగ్గించేలా విద్యాబోధన ఉండాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు.

విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను తయారు చేస్తున్నట్లు హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అదేవిధంగా టీచర్ల బదిలీకి ప్రత్యేక చట్టం చేస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి.. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులపై భారం మోపితే పాఠాలు సరిగా బోధించలేరన్నారు. అందుకే ఉపాధ్యాయులకు యాప్ కష్టాలు తొలగిస్తూ సింగిల్ యాప్ అందుబాటులోకి తెస్తున్నట్లు సభలో ప్రకటించారు.

గత ప్రభుత్వం ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి రూ.5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వానికి ప్రగల్భాలు పలకడమే తప్ప ఆచరణలో చూపలేకపోయిందని విమర్శించారు. ‘వన్ క్లాస్-వన్ టీచర్’ విధానాన్ని తాము బలంగా విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం అమలు అవుతున్నట్లు తెలిపారు. 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకువస్తున్నాం. వారికి నాణ్యమైన యూనిఫాం ఇస్తున్నామని వివరించారు. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్నివర్గాలు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News