ఈడీ విచారణకు కేటీఆర్.. ఏం జరగబోతోంది..?

ఇదిలా ఉండగా.. ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నాయి.

Update: 2025-01-16 07:54 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు నుంచి క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం గండిపేట ఫాంహౌస్ నుంచి ఈడీ ఆఫీసుకు ఆయన వచ్చారు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ బీఆర్ఎస్ కేడర్ కనిపిస్తోంది. ఈడీ విచారించి వదిలిపెడుతుందా..? లేదంటే అదుపులోకి తీసుకుంటుందా..? అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.

ఈ కేసులో ఈ నెల 9న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించరు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై విచారిస్తున్నారు. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీపైనే ఈడీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఈడీ అనుమతించింది. లీగల్ టీంకు ఎలాంటి పర్మిషన్ లేదని తేల్చిచెప్పింది.

వాస్తవానికి ఈ నెల 7వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ.. తాను రాలేనని చెప్పడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి సమయం ఇచ్చింది. ఇదే కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఈ నెల 9న విచారించారు. దాదాపు 80 ప్రశ్నలు అడిగి తగిన సమాధానాలు రాబట్టారు. ఇప్పటికే అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఏసీబీ.. మరోమారు ముగ్గురిని కలిపి విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కేటీఆర్ ఈడీ విచారణ పూర్తికాగానే వీరికి మరోసారి నోటీసులు పంపి విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు.. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టారని.. కొట్టివేయాలంటూ గతంలో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొన్ని రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరుగగా.. చివరకు హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్ దొరకలేదు. అన్ని రకాల విచారణలు ఎదుర్కోవాల్సిందేనంటూ ఆదేశించింది. ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరుకావాలని సూచించింది. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో వెంటనే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని అత్యవసరంగా విచారించాలని కేటీఆర్ తరఫున లాయర్ కోరినప్పటికీ సుప్రీంకోర్టు స్వీకరించలేదు. దీంతో నిన్న విచారణకు తీసుకుంది. అయితే.. అక్కడా కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఏం చేయలేక కేటీఆర్ సుప్రీంకోర్టులో నుంచి క్వాష్ పిటిషన్‌ను వాపస్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడంతో ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. బీఆర్ఎస్ నేతల వాహనాలను ఈడీ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించలేదు. గన్‌పార్క్ వద్దనే గులాబీ శ్రేణుల వాహనాలను ఆపేశారు. దీంతో గన్‌పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు వారంతా నడుచుకుంటూ వెళ్లారు. కాగా.. పోలీసులు వారందరినీ అడ్డుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగితే అడ్డుకునేందుకు పది ప్లటూన్లకు చెందిన సుమారు 200 మంది పోలీసులను సిద్ధంగా పెట్టారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించే తుపాకులతో పోలీసులు మోహరించారు. రోప్ పార్టీ పోలీసులతోపాటు వజ్ర వాహనాలను సైతం సిద్ధం చేశారు. మొత్తానికి ఈడీ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

కాగా.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ కీలక లెన్తీ ట్వీట్ చేశారు. ఈ కేసు రాజకీయ కుట్ర అంటూ మరోసారి మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, ఆరోపణలన్నింటినీ ఖండించారు. హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ హోస్ట్ చేయడం మంత్రిగా తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనదని.. తాను తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమల పెద్దలు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించడం మనకు గర్వకారణమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు తనను ఏం చేయలేవని పేర్కొన్నారు. ఎఫ్ఈఓకి రూ.46 కోట్లు బ్యాంకు టు బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడా దుర్వినియోగం జరగలేదని తెలిపారు. ప్రతి రూపాయికి లెక్క క్లియర్‌గా ఉన్నదని పేర్కొన్నారు. అసలు ఇందులో అవినీతి దుర్వినియోగం, మనీలాండరింగ్ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని, న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News