క్రెడిట్ కోసం కుస్తీలు.. కూటమిలో రగడ ..!
కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఎవరు దోహద పడ్డారు? ఎవరు కృషి చేశారు? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంది.
కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఎవరు దోహద పడ్డారు? ఎవరు కృషి చేశారు? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంది. దీనికి ఎవరికి వారే తమకు క్రెడిట్ కావాలంటే తమకు కావాలంటూ అంతర్గ త కుమ్ములాటలు పడుతూనే ఉన్నారు. సహజంగా రాజకీయ నేతలు ఇలా.. వ్యవహరించడం కామనే. కానీ, రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్పుకొనే కొన్ని వ్యవస్థలు కూడా ఇప్పుడు క్రెడిట్ కోసం తపన పడుతుండడం గమనార్హం.
ఆ వ్యవస్థల గురించి ఎలా ఉన్నా.. అంతర్గతంగా క్షేత్రస్థాయిలో టీడీపీ-బీజేపీ-జనసేనల మధ్య మాత్రం ఈ చర్చ రోజూ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది. అందుకే ఆయా పార్టీల నాయకుల మధ్య పెద్దగా సఖ్యత ఉండడం లేదన్నది వాస్తవం. టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సెంటిమెంటు రగిలిందని, దీనికి యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర మసాలా కలిపిందని తమ్ముళ్లు చెబుతున్నారు.
ఇక, పవన్ చేసిన త్యాగాలు.. కూటమి కోసం ఆయన పడిన మాటలు, తపన, ఢిల్లీ పెద్దల ముందు గంటల తరబడి చర్చలు వంటివి కలిసివచ్చి.. కూటమి కట్టామని.. పవర్ వచ్చిందంటే.. పవనే కారణమని జనసే న నాయకులు చెబుతున్నారు. ఇక, బీజేపీ జట్టుకట్టకపోతే.. జనాలు ఆదరించే వారే లేరన్నది బీజేపీ నాయకులు చెబుతున్న మాట. ఇలా.. ఎవరికి వారు.. వారి వారి క్రెడిట్ లెక్కలు చూసుకుంటున్నారు. సరే.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే.. రీజన్ ఉంది.
క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలు కలివిడిగా ఉండాలని..కలసి ముందుకు సాగాలని చంద్రబాబు చెబుతున్నారు. వచ్చే ఏడాదిన్నరలో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు.. మరికొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలన్నది చంద్రబాబు సూచన. ఈ క్రమంలో సభలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కలివిడిగా కూర్చునేందుకు క్రెడిట్ అడ్డం వస్తోంది. దీంతో గ్రౌండ్ లెవిల్లో కూటమి పార్టీల సఖ్యత పెద్దగా కనిపించడం లేదన్నది వాస్తవం.