ముస్లిం కరసేవక్ కు అయోధ్య నుంచి లేఖ.. అక్షతలు

అదే సమయంలో.. ముస్లింలోని కొందరు అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం తపిస్తుంటారు.

Update: 2024-01-08 04:48 GMT

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం. ఈ దేశంలోని వైరుధ్యాలు ప్రపంచంలోని మరే దేశంలోనూ ఉండవేమో. విభేదాల్లోనూ ఒకలాంటి భిన్నత్వం మన దేశంలో మాత్రమే కనిపిస్తుంది. అయోధ్యలో రామాలయాన్ని రాజకీయంగా విభేదించే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కనిపిస్తారు. ముస్లింలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. అదే సమయంలో.. ముస్లింలోని కొందరు అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం తపిస్తుంటారు.

అంతదాకా ఎందుకు? అయోధ్యలోని వివాదాస్పద కట్టడం ఉన్న ప్రదేశంలో మసీదు నిర్మాణం కోసం సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన పెద్దమనిషి.. ఈ రోజున అయోధ్యలో రామాలయాన్ని స్వాగతించటమే కాదు.. ఇందులో భాగంగా అయోధ్యకు ఈ మధ్యన వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీ వేళ.. తానే స్వయంగా పూలు జల్లి స్వాగతం పలకటం కనిపిస్తుంది. అంతేనా.. ముస్లిం బాలికలు పలువురు రామమందిర వేళ.. రామ నామంతో పాటలు పాడటం సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే.

కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారన్న అంశంలో.. అదే సమూహానికి చెందిన మరికొందరు అందుకు భిన్నంగా వ్యవహరించటం దేశంలో చూస్తుంటాం. అయోధ్యలో కరసేవలో హిందువులు మాత్రమే కాదు.. కొందరు ముస్లింలు పాల్గొన్నారు. ఆ కోవలోకే వస్తారు ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ కు చెందిన హబీబ్. ఇతను శ్రీరామచంద్రుడ్ని తమ పూర్వీకుడిగా భావిస్తుంటారు. 1992 నాటి అయోధ్య కరసేవ ఆందోళనలో ఈయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ 70 ఏళ్ల హబీబ్ ను అయోధ్యలోని రామాలయ కమిటీ గుర్తు పెట్టుకొని మరీ.. ఆయన ఇంటికి కొన్ని అక్షతలు.. రామమందిర ఫోటోతో పాటు ఒక లేఖను సైతం పంపారు.

దీన్ని అందుకున్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరసేవకుడిగా మాత్రమే కాదు సామాజిక కార్యకర్తగా సుపరిచితుడైన ఆయన..అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీల్లో చూస్తానని.. జనవరి 22న తర్వాత అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఆయనకు సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News