ట్రెండింగ్ లో 'లాక్ డౌన్'

సోషల్ మీడియా ‘ఎక్స్’లో లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధించాలని, వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలనే నెటిజన్లు కోరుతున్నారు.

Update: 2025-01-06 22:30 GMT

లాక్ డౌన్.. సరిగ్గా ఐదేళ్ల కిందట వినిపించిన పదం.. అసలు భారతీయులకు అప్పటివరకు తెలియని పదం కూడా.. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తితో ప్రధాని మోదీ నేరుగా టీవీల్లోకి వచ్చేసి లాక్ డౌన్ ప్రకటించేసింది. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వలస కూలీలు నానా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఇక సినీ నటుడు సోనూ సూద్ లాంటి వారు లాక్ డౌన్ సమయంలో ఉదారంగా సాయం చేస్తూ హీరో అయిపోయారు.

అప్పట్లో ఏం జరిగింది?

2020 జనవరి చివర్లో భారత్ లో తొలి కొవిడ్ కేసు నమోదైంది. అప్పటికీ ఎవరూ లాక్ డౌన్ గురించి ఊహించలేదు. అయితే కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ ఆందోళన మొదలైంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు లాక్ డౌన్ ప్రకటించింది. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ నిలిచిపోతే వైరస్ నిర్వీర్యం అవుతుందని భావించారు. ఆ రోజు గడిచిందో లేదో కేంద్ర ప్రభుత్వమూ లాక్ డౌన్ ప్రకటించేసింది. దీనిని దశల వారీగా ఎత్తేస్తూ వచ్చారు. 2020 జూన్, జూలై నాటికి అన్ లాక్ జరిగింది. అయితే, అందరూ భావించినట్లు కొవిడ్ వైరస్ మాత్రం నిర్వీర్యం కాలేదు. వ్యాప్తి వివిధ రూపాల్లో సాగిపోయింది. ఇక 2021లో కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ లాక్ డౌన్ విధించినా అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కాదు. స్థానిక పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్ డౌన్ విధించుకునే అవకాశం ఇచ్చారు.

మళ్లీ ఇప్పుడు ఎందుకు?

కొవిడ్ పుట్టిన చైనాలోనే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అదే వైరస్ కేసులు భారత్ లోనూ నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ ప్రస్తావన వస్తోంది. సోషల్ మీడియా ‘ఎక్స్’లో లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధించాలని, వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలనే నెటిజన్లు కోరుతున్నారు. కొందరైతే మీమ్స్ షేర్ చేస్తున్నారు. బాధ్యతగా, హ్యూమన్ టచ్ తో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో చాలామంది చిరుద్యోగులు చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయిన నేపథ్యాన్ని గుర్తుచేస్తున్నారు. అటుతిరిగి ఇటుతిరిగి బాగు పడింది ఫార్మా మాఫియానే అని నిందిస్తున్నారు.

Tags:    

Similar News