లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఎంత దూరం ?

పొరుగు రాష్ట్రం తమిళనాడులో డీఎంకే నుంచి ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-09-30 04:06 GMT

పొరుగు రాష్ట్రం తమిళనాడులో డీఎంకే నుంచి ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక విధంగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన మంత్రి అయింది 2022 డిసెంబర్ ప్రాంతంలో అంటే గట్టిగా రెండేళ్ళు తిరగకుండానే డిప్యూటీ సీఎం పోస్టుని అందుకున్నారు అన్న మాట.

డీఎంకే ఒక ప్రాంతీయ పార్టీ. సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉన్న డీఎంకే సౌతిండియాలో తెలుగుదేశం తదితర పార్టీలకు స్పూర్తిగా ఉంటూ వస్తోంది. ఇక డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటు అయినపుడు వ్యవస్థీకృతంగా కనిపించినా కరుణానిధి నాయకత్వంలోకి వచ్చాక మెల్లగా కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆయన వారసుడు స్టాలిన్ అయితే ఆయన వారసుడు ఉదయనిధి.

ఇక ఇదే విధమైన పోలిక టీడీపీ విషయంలోనూ ఉంది అని అంటారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు టీడీపీ కుటుంబ పార్టీ కాదు, కానీ ఆ తరువాత నెమ్మదిగా ఆ రూపు సంతరించుకుంది. ఇపుడు టీడీపీని వారసత్వ పార్టీగానే చూస్తున్నారు. బాబు తరువాత వారసుడు లోకేష్ అని అంతా అనుకుంటున్నదే.

లోకేష్ విషయానికి వస్తే రాజకీయంగానే కాదు, మంత్రి పదవులను నిర్వహించడంలోనూ ఉదయనిధి కంటే సీనియర్. 2017లోనే లోకేష్ మంత్రి అయి రెండేళ్ల పాటు పనిచేశారు. ఇపుడు మరోసారి మంత్రిగా ఉన్నారు. నిజానికి 2019లో టీడీపీ వరసగా మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అయిదేళ్ల టెర్మ్ లో లోకేష్ సీఎం అయ్యేవారు అన్న మాట కూడా అప్పట్లో ప్రచారంలో ఉంది. అయితే 2024లో లోకేష్ మంత్రిగానే మళ్ళీ కనిపించారు. ఈ అయిదేళ్ళలో ఆయన సీఎం అవుతారు అంటే అది అంత జరిగే వ్యవహారం కాదు.

కూటమి పార్టీలతో నడుస్తోంది. టీడీపీకి సొంతంగా బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నా జన్సేన బీజేపీలను దూరం చేసుకునే ఆలోచనలో అయితే బాబు లేరు. దాంతో లోకేష్ ని మంత్రిగానే కొనసాగిస్తున్నారు. మామూలుగా టీడీపీ సొంతంగా ప్రభుత్వం అయితే ఈపాటికి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయినా అయి ఉండేవారు.

ఇపుడు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలన్న కండిషన్ మీదనే పవన్ ఆ పదవి స్వీకరించారు. దాంతో మరో ఉప ముఖ్యమంత్రి అన్న చాన్సే లేదు. మరి ఈ అయిదేళ్ళలో ఏమైనా రాజకీయ మార్పులు అనుకోని అవాంతరాలు ఎదురైతే అపుడు లోకేష్ గురించి ఆలోచించాలి. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఉదయనిధికి రాగానే ఏపీలో కూడా లోకేష్ గురించి అందరూ చర్చించుకోవడం కనిపిస్తోంది.

అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు ఎకా ఎకీన ముఖ్యమంత్రే అవుతారు అని టీడీపీలో ఆయన అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ కి టీడీపీలో మంచి భవిష్యత్తు ఉంది. అందులో ఎవరికీ అనుమానం లేదు. ఆయన ఇంతకంటే పెద్ద పదవులే అందుకుంటారు అని కూడా రాజకీయ విశ్లేషకుల మాట. ఆ రోజు ఎపుడూ అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News