జాతీయ స్థాయిలోనూ లోకేష్ మెరుపులు.. !
కేంద్రంలోనూ బలమైన పునాదులు వేసుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారు.;
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. తన పునాదులను బలోపేతం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నారా లోకేష్.. టీడీపీకి భవిష్యత్తు దిశానిర్దేశకుడు అనేది ఖాయం. అదేసమయంలో చంద్రబాబు తర్వాత.. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా! అయితే.. ఇదేదో కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యేలా ఆయన వ్యవహరించడం లేదు. కేంద్రంలోనూ బలమైన పునాదులు వేసుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండే అభ్యర్థికి జాతీయస్థాయిలో కూడా మంచి పలుకుబడి.. మెరుపులు అవసరం. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా జాతీయ స్థాయిలోనే మెరుపులు కురిపించారు. జాతీయస్థాయిలో తనను గుర్తించేలా ఆయన వ్యవహరించారు. దీంతో సీఎం అయిన తర్వాత.. ఢిల్లీ స్థాయిలో జగన్ పేరు వినిపించింది. అలానే.. ఇప్పటి నుంచే నారా లోకేష్ నేషనల్ లీడర్‌గా ఎదిగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్నాళ్ల కిందట.. ఆయన జాతీయస్థాయిలో పర్యటించి..కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. దీంతో జాతీయ మీడియా ప్రత్యేకంగా నారాలోకేష్ ప్రస్థానంపై ఫోకస్ చేసింది. ఆయన పనితీరు, మాట తీరును కూడా అంచనా వేసింది. ఇది జరిగిన చాన్నాళ్లకు తాజాగా నారా లోకేష్ ఇండియా టుడే కాన్ క్లేవ్‌లో మాట్లాడారు. అయితే.. అప్పటికి ఇప్పటికి కూడా.. నారా లోకేష్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. జాతీయసమస్యలపైనా ఆయన స్పందించిన తీరును విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.
అదేవిధంగా జాతీయ అంశాలతోనే కాకుండా..కూటమి మద్దతు, కలివిడి, మిత్ర పక్షాల వ్యవహారంపై కూడా .. ఎక్కడా తొట్రుపాటు లేకుండా నారా లోకేష్ స్పందించారు. బీజేపీతో కలిసి ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు. ఇదేసమయంలో ఏమైనా సమస్యలు ఉంటే.. చర్చించి పరిష్కరించుకుంటామని కూడా చెప్పా రు. ఈ తరహా రాజకీయాలు జాతీయస్థాయిలో వెలుగొందేందుకు ఎంతగానో దోహదపడతా యనడంలో సందేహం లేదు. అంతేకాదు.. జాతీయస్థాయిలో ఎదిగేందుకు అవసరమైన అన్ని లక్షణాలను కూడా ఆయన ప్రదర్శించడం గమనార్హం. ఇలా.. నారా లోకేష్ రాజకీయ పునాదులు మరింత బలోపేతం అవుతుండడం గమనార్హం.