లోకేష్ మాటలు కోటలు దాటాయ్!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దేశ రాజధాని పర్యటనలో ఉన్నారు.

Update: 2024-10-22 04:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దేశ రాజధాని పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తీరిక లేని షెడ్యూల్ ను గడుపుతున్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు.

ఇందులో భాగంగా కేంద్రమంత్రి జయంత్ చౌధురి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని.. కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే సమయంలో... ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షతన ఏర్పాటైన భేటీలో పాల్గొన్నారు.

ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన లోకేష్... దేశంలోనే అత్యంత సులభతరమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోన్నామని తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీని కూడా అమలుచెస్తున్నామని.. ఏపీలో ఎలక్ట్రానిక్స్ సహా అన్ని రకాల పరిశ్రమలూ ఏర్పాటు చేయడానికి అనువైన అపారమైన అవకాశాలు ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూల వ్యవస్థ ఉందని వెల్లడించారు.

ఇదే క్రమంలో... అనంతపురంలో కియా మోటార్స్ ని తీసుకొచ్చామని గుర్తు చేసిన లోకేష్... వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇదే సమయంలో తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తామని.. దీనికి పారిశ్రామికవేత్తలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలోనే... వీటితో పాటు ఐటీ, ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, దేశాలతోనూ పోటీ పడుతున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయంటూ వాస్తవ పరిస్థితిని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు, నెటిజన్లు.

ఇందులో భాగంగా... అక్కడున్నది పారిశ్రామిక వేత్తలు కాబట్టి, వారిని ఆకర్షించడానికి మార్కెటింగ్ లో భాగంగా ఏవేవో చెప్పినా పర్లేదు కానీ... వాస్తవ పరిస్థితులు మాత్రం మరిచిపోవద్దని అంటున్నారు. ఇదే సమయంలో... రాష్ట్రంలో ఇప్పుడు అప్పు లేకపోతే నెల గడవని పరిస్థితి అని గుర్తుచేస్తున్నారు.

అవును... ఏపీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా అధ్వాన్నంగా ఉందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రతీ మంగళవారం అప్పు కోసం ఆర్బీఐ వైపు చూడాల్సిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. దీనికి తోడు ఇంతవరకూ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి.. ఉద్యోగాల కల్పనలో అదోగతి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు లేవని.. ఎన్నో హామీలు ఇచ్చామని.. ఇప్పుడు అవన్నీ నెరవేర్చాలంటే ఆర్ధిక పరిస్థితిని చూస్తుంటే భయమేస్తోందని చెప్పుకుంటున్న సంగతీ తెలిసిందే. హామీలిచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ, కనీసం సూపర్ సిక్స్ పథకాలైనా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని దయనీయ స్థితి అని చెబుతున్నారు!

కళ్లముందు కష్టాలు స్పష్టంగా సాక్ష్యాత్కరిస్తున్నాయి. "తల్లికి వందనం" ఎప్పుడు పెడతారు అని పిల్లలను బడికి పంపుతున్న తల్లులు అడుగుతున్నారు... నెలకు రూ.1,500 ఎప్పుడు ఇస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు... నిరుద్యోగ భృతి ఎక్కడ అని యువకులు నిలదీస్తున్నారు.. ఇస్తామన్న డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. చినబాబు చెప్పిన.. దేశాలతో పోటీ మాటలు.. కోటలు దాటుతున్నాట్లే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News