దేశంలో ఈవీఎంల ద్వారా ఇన్ని దొంగ ఓట్లు పడ్డాయా..?

ఆ సంగతి అలా ఉంటే... రాష్ట్రాల వారీగా లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఈ తరహా పోస్ట్ హల్ చల్ చేస్తుంది.

Update: 2024-07-25 04:49 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలపై పలువురు నేతలు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. ఈవీఎం మెషిన్స్ లో ఫలానా లోపాలు జరిగడం వల్ల 79 స్థానాల్లో బీజేపీకి లబ్ధి చేకూరిందంటూ ఎన్డీయే కూటమి వ్యతిరేక పక్షాలు ఓ పోస్ట్ ని వైరల్ చేస్తున్నాయి.

 

వీటిలో అధికంగా... ఒడిస్సా 18, మహరాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్ లో 10 స్థానాలు ఉన్నాయని ఆ పోస్టులో పేర్కొంటున్నారు! ఈ మేరకు... లోక్ సభ ఎన్నికల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతం ఓ వర్గం సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... రాష్ట్రాల వారీగా లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఈ తరహా పోస్ట్ హల్ చల్ చేస్తుంది. దీని ప్రకారం... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లోనూ కలిపి సుమారు 49 లక్షల ఓట్ల విషయంలో అవకతవకలు జరిగిందనేది ఆ పోస్ట్ లోని సారాంశంగా ఉంది.

అంటే... ఈవీఎంలలో ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే నాటికి ఉన్న ఓట్ల కంటే, కౌంటింగ్ సమయానికి ఉన్న ఓట్ల సంఖ్య ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 49 లక్షలు ఎక్కువ అని, ఇవన్నీ దొంగ ఓట్లని చెప్పడం ఆ పోస్ట్ ఉద్దేశ్యం అన్నమాట!

ఇదే సమయంలో... ఏపీలో 49 లక్షల ఓట్లతో పాటు ఒడిశాలో 42.01, మహారాష్ట్రలో 82.63, పశ్చిమ బెంగాల్ 36.71, కర్ణాటక 22.33, చత్తీస్ ఘర్ 9.54, రాజస్థాన్ 29.3, బీహార్ 11.6, హర్యానా 12.91, మద్యప్రదేశ్ 21, తెలంగాణ 14.22, అస్సాం 15, అరుణాచల్ ప్రదేశ్ 1.09, గుజరాత్ 16.17, కేరళ 17.12 లక్షల ఓట్లు తేడాలు జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ తరహా ప్రచారానికి గల ఆధారం ఏమిటనేది తెలియదు కానీ... ఏపీలో వైసీపీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పాటు పలు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఈ మేరకు సదరు పోస్ట్ ని నెట్టింట వైరల్ చేస్తున్నాయని తెలుస్తోంది!

Tags:    

Similar News