టెన్షన్ పుట్టిస్తున్న మధుర స్వామి.. శ్రీకాళహస్తికి ఎందుకు వచ్చినట్లు?
వేలాది కోట్ల ఆస్తులు ఉన్న మధుర మఠాన్ని విడిచి పెట్టిన ఆయన ఆచూకీ కొద్ది రోజులుగా మిస్ కావటంతో దేశ వ్యాప్తంగా ఆయన కోసం నిఘా వర్గాలు ఫోకస్ చేశాయి.
శ్రీగురు శరానందజీ మహరాజ్ అన్నంతనే గుర్తించకపోవచ్చు. మధుర స్వామిజీగా ఆయన సుపరిచితులు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని మధురలోని శ్రీ ఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురు శరానందజీ మహారాజ్ తిరుమలకు అనూహ్యంగా రావటం ఒక ఎత్తు అయితే.. గుట్టుచప్పుడు కాకుండా మఠాన్ని వదిలేసి.. తిరుమలకు రావటం ఒక ఎత్తు. అక్కడ సాదాసీదాగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అంతే సీక్రెట్ గా శ్రీకాళహస్తికి చేరుకొని.. అక్కడి శ్రీశుక బ్రహ్మశ్రమంలో ఉన్నట్లుగా గుర్తించారు.
వేలాది కోట్ల ఆస్తులు ఉన్న మధుర మఠాన్ని విడిచి పెట్టిన ఆయన ఆచూకీ కొద్ది రోజులుగా మిస్ కావటంతో దేశ వ్యాప్తంగా ఆయన కోసం నిఘా వర్గాలు ఫోకస్ చేశాయి. శాంతి స్థాపన కోసం బౌద్ధ గురువు దలైలామా.. ముస్లిం మత పెద్దలతో పలు సమావేశాల్ని నిర్వహించటం తెలిసిందే. అలాంటి ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆశ్రమాన్ని విడిచి పెట్టి బయటకు రావటంతో నిఘా వర్గాలు అలెర్టు అయ్యాయి. ఆయన కోసం దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. అలాంటి ఆయన.. తాజాగా శ్రీకాళహస్తిలోని శ్రీశుక బ్రహ్మాశ్రమంలో ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే.. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరించారు.
అదే సమయంలో ఆశ్రమ ఉద్యోగులకు.. ఆయన శిష్యులకు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వటంతో వారు హుటాహుటిన శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ఇంతకూ ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. మానసిక ప్రశాంతత కోసం తాను వచ్చినట్లు చెప్పిన మధుర స్వామి.. శ్రీకాళహస్తిలోని మఠాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. శ్రీకాళహస్తి మఠం స్వామి శ్రీవిద్యా స్వరూపానందగిరి గతంలో వారణాసిలోని బెనారస్ వర్సిటీలో చదువుకున్నారు. ఆ టైంలో అక్కడ మధుర స్వామి కూడా ఉండేవారు. ఇద్దరు కలిసి చదువుకోవటంతో ఆ పరిచయంతో గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రమానికి చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా వెతుకున్న మధుర స్వామీజీ శ్రీకాళహస్తిలోని ఆశ్రమంలో ఉండటంతో ఒక్కసారిగా ఏపీ పోలీసులు.. నిఘా వర్గాల యాక్టివేట్ అయ్యాయి. వెంటనే.. భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ అంశంపై మధుర స్వామిజీ స్పందిస్తూ.. తాను ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చానని.. దానికి భంగం వాటిల్లితే అక్కడి నుంచి కూడా వెళ్లిపోతానని పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకొని చెన్నై వెళ్లిపోతున్నట్లుగా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే చెన్నైకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తంగా స్వాములోరి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.