2029 మెజారిటీ గురించి మాట్లాడుతున్న వైసీపీ అభ్యర్థి!

ఈ సందర్భంగా 2029 ఎన్నికల్లో అభ్యర్థిత్వం, ఫలితాలు, మెజారిటీ గురించి మాట్లాడేస్తున్నారు వైసీపీ నేత!

Update: 2024-05-29 02:30 GMT

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరో వారం రోజుల్లోపు జూన్ 4న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎవరు బెటర్ లక్ నెక్స్ట్ టైం మెసేజ్ లకు ఎలిజబుల్ అవుతారు వంటి విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా 2029 ఎన్నికల్లో అభ్యర్థిత్వం, ఫలితాలు, మెజారిటీ గురించి మాట్లాడేస్తున్నారు వైసీపీ నేత!

అవును... 2024 ఎన్నికల ఫలితాల కోసం కొంతమంది అభ్యర్థులు, అనుచరులు, పార్టీ శ్రేణులూ తలలుపట్టుకుని టెన్షన్ తో విలవిల్లాడిపోతున్న నేపథ్యంలో... 2024లో గెలిచేశాం, 2029 గురించి ఆలోచించండి అన్నస్థాయిలో మాట్లాడుతున్నారు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్. తాజాగా పార్టీ మండల స్థాయి నాయకులతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా అనకాపల్లిలోని వైసీపీ మండలస్థాయి నాయకులతో భేటీ అయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... "ఈ ఎన్నికల్లో గెలిచేశాం అనుకోండి.. ఆ విషయాన్ని మైండ్ లో నుంచి తీసేయండి.. 2029లో ఎంత మెజారిటీ తెచ్చుకోవాలనే విషయంపై నేను ఆలోచిస్తున్నాను.. మీరు కూడా అదే ఆలోచించండి" అని అన్నారు.

ఇదే క్రమంలో... 2029లోనూ అనకాపల్లి వైసీపీ అభ్యర్థి తానే అని చెప్పిన భరత్... మీరంతా ఇప్పుడు సహకరించినట్లే 2029లోనూ సహకరించాలని తెలిపారు. ఇదే సమయంలో... గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో జూన్ 4న ఫలితాలు వచ్చిన అనంతరం ప్రతీ గ్రామానికి వెళ్లి ప్రతీ కుటుంబాన్ని పలకరించి ధన్యవాదాలు తెలుపుకుందామని అన్నారు.

కాగా... 2024 ఎన్నికల సమయంలో ఊహించని రీతిలో భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. అభ్యర్థుల ప్రకటన అధికారికంగా చేసేవరకూ చాలా మందికి ఈ విషయంపై కావాల్సినంత అస్పష్టత ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 2029లో అభ్యర్థిత్వం, మెజారిటీపై భరత్ స్పందించడం ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News