ఏపీలో పీకే గుట్టు విప్పిన మమతా బెనర్జీ... తెరపైకి కీలక విషయం!

ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై పీకే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. ఒక కీలక విషయం వెల్లడించారు మమతా బెనర్జీ!

Update: 2024-04-17 08:07 GMT

ఏపీలో ఎన్నికలకు వేళైన సంగతి తెలిసిందే. మరోపక్క దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సమయంలో రానున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ భావిస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి నిలవాలని కూటమి ప్రయత్నాలు చేస్తుంది! ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై పీకే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. ఒక కీలక విషయం వెల్లడించారు మమతా బెనర్జీ!

అవును... ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రశాంత్ కిశోర్ ఇదివరకు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ తన అయిదేళ్ల కాలంలో రోడ్లు వేయలేదని, రాజధాని నిర్మాణం చెపట్టలేదని, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని, ప్రతి నెలా డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీంతో అతను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో.. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. తాజాగా ఓ బెంగాలీ న్యూస్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... ఈ లోక్‌ సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్, తమ పార్టీ కోసం పని చేయట్లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ ఏపీలో బిజీగా ఉన్నారని అన్నారు.

ఇందులో భాగంగా ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని.. టీడీపీ - బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో... ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని, ఆ కారణంతోనే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు మళ్లీ విజయం సాధిస్తాయంటూ చెబుతున్నాడని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా "ఇండియా"కూటమికి వ్యతిరేకత ఉందంటూ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని స్పష్టం చేశారు.

దీంతో... ఏపీలో కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ తెరవెనుక పని చేస్తూ.. తెరముందు మాత్రం న్యూట్రల్ పర్సన్ లా కనిపిస్తూ.. వైసీపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని జనం ఓ క్లారిటీకి వస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది! అనంతరం నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది! ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో... నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25 కాగా.. ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఉంటుంది.

Tags:    

Similar News