భారత్ లో మినీ బ్రెజిల్.. మన్ కీ బాత్ లో మోడీ
మన దేశం లో మినీ బ్రెజిల్ ఉందంటూ ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చరు.
పదేళ్ల క్రితం మౌన ప్రధాని వద్దు మాట్లాడే ప్రధాని మాక్కావాలన్న దేశ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేలా మోడీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవటం జరిగింది. మిగిలిన సంగతుల్ని పక్కన పెడితే.. ఆయన కారణంగా ఒక కొత్త కార్యక్రమం తెర మీదకు వచ్చింది. దేశ ప్రజల ను ఉద్దేశించి.. తన మనసు లోని మాటను చెప్పేందుకు వీలుగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ఈ ప్రోగ్రాంకు ఆల్ ఇండియా రేడియో వేదికగా మారింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికి షురూ చేసిన ఈ కార్యక్రమం కారణంగా దేశం లోని వివిధ ప్రాంతాల కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ.
రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీగా ఉంది బిచార్ పూర్ గ్రామ కథ. ఈసారి ఫుట్ బాల్ అంశాన్ని తీసుకున్న ప్రధాని.. మన దేశం లో మినీ బ్రెజిల్ ఉందంటూ ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చరు. ప్రముఖ మీడియా హౌస్ చెప్పని ఈ సక్సెస్ స్టోరీ గురించి ప్రధాని మోడీ చెప్పిన మాటల తో ఇప్పుడీ ప్రాంతం గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేలా చేశారు.
మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లా బిచార్ పూర్ అనే గ్రామాన్ని మినీ బ్రెజిల్ గా పిలుస్తారని.. ఒకప్పుడు కల్తీ మ్యం.. మాదక ద్రవ్యాల కు బానిసగా ఉన్న ప్రాంతం ఇప్పుడు అందుకు భిన్నంగా ఫుట్ బాల్ క్రీడాకారుల కు సీడింగ్ కేంద్రంగా మారిన వైనం గురించి ఆసక్తికర అంశాలు ఎన్నింటినో చెప్పుకొచ్చారు. బిచార్ పుర్ గ్రామం గురించి..అది సాధించిన విజయాల గురించి అఖిల భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ అందించిన సమాచారాన్ని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. పాతికేళ్ల క్రితం ఆ గ్రామం లో కల్తీ మద్యం.. మాదక ద్రవ్యాల మత్తులో కూరుకుపోయిందని.. ఎందరో యువకులపై దాని ప్రభావం పడినట్లుగా ప్రధాని పేర్కొన్నారు.
అలాంటి గ్రామం ఒక కోచ్ కారణంగా మత్తు నుంచి ఫుట్ బాల్ ఆటను ప్రాణంగా ప్రేమించే ప్రాంతంగా మారినట్లు చెప్పుకొచ్చారు. రయూస్ అహ్మద్ అనే ఫుట్ బాల్ క్రీడాకారుడి పుణ్యమా అని ఆ ప్రాంతం రూపురేఖలు మారాయన్న ప్రధాని.. "ఆ కోచ్ ఎంతో సాయం చేశారు. మత్తులో మునిగిన యువత ను ఫుట్ బాల్ క్రీడను పరిచయం చేశారు. అక్కడి యువత లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఫుట్ బాల్ కోచింగ్ ఇవ్వటానికి సరైన వనరులు లేనప్పటికీ అంకితభావంతో అక్కడి యువత కు ఫుట్ బాల్ నేర్పించారు. కొన్నేళ్లకు ఫుట్ బాల్ పుణ్యమా అని బిచార్ పూర్ కు ఎంతో పేరు వచ్చింది"అని చెప్పారు.
ఫుట్ బాల్ క్రాంతి ప్రోగ్రాం పేరుతో నిర్వహిస్తున్న పోటీల పుణ్యమా అని ఫుట్ బాల్ క్రీడ వైపు యువత ఆకర్షితులు కావటంతో ఆ ప్రాంతం నుంచి నలభై మంది జాతీయ.. రాష్ట్రస్థాయి ఆటగాళ్లు పుట్టుకొచ్చినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. "ఈ ఫుట్ బాల్ విప్లవం ఇతర ప్రాంతాల కు వ్యాప్తి చెందుతోంది. ఈ ప్రోగ్రాం కారణంగా షాదోల్ జిల్లాలో 1200లకు పైగా ఫుట్ బాల్ క్లబ్ లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జాతీయ స్థాయి లో ఆడుతున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ప్రముఖ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారులు.. కోచ్ లు ప్రస్తుతం ఇక్కడ యూత్ కు శిక్షణ ఇస్తున్నారు. కల్తీ మద్యానికి.. మాదక ద్రవ్యాల కు పేరుగా ఉన్న గిరిజన ప్రాంతం ఇప్పుడు ఫుట్ బాల్ నర్సరీగా మారింది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మన దేశం లో ప్రతిభకు కొదవ లేదు. అయితే.. ఇలాంటి ప్రతిభను మనం వెతికి పట్టుకోవాలి" అంటూ చెప్పిన మాటలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మోడీ పాలనపై భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ.. మారుమూల ప్రాంతాల్లోని సక్సెస్ స్టోరీల ను మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా దేశ ప్రజలందరికి తెలిసేలా చేసే ప్రధాని మోడీ లోని ఈ యాంగిల్ ను మాత్రం అందరూ అభినందిస్తారని మాత్రం చెప్పక తప్పదు.