శ్రీచైతన్య విద్యాసంస్థలకు షాకిచ్చిన టీ.సర్కార్ : సంస్థ ఆ లైసెన్స్ రద్దు!
హైదరాబాద్ నగరంలో ఆ సంస్థ విద్యాసంస్థలకు భోజనం సరఫరా చేసే మాదాపూర్ లోని సెంట్రల్ కిచెన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థలైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్యకు షాకిచ్చింది. మాదాపూర్ లో శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ నిర్వహణ సరిగా లేదని, పరిశ్రభత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేసింది.
ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీచైతన్యకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆ సంస్థ విద్యాసంస్థలకు భోజనం సరఫరా చేసే మాదాపూర్ లోని సెంట్రల్ కిచెన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 125 కిలోల గడువు తీరిన ఆహారాన్ని గుర్తించడంతోపాటు వంట శాలలో బొద్దింకలు, ఎలుకలు తిరగడాన్ని గమనించారు. ఇది వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని భావించి సెంట్రల్ కిచెన్ లైసెన్సు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వంట శాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు అక్కడ నిల్వ చేసిన బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను పరిశీలించారు. అన్నీ అపరిశుభ్ర వాతావరణంలోనే ఉన్నాయని గుర్తించారు. ఇలాంటి చోట తయారుచేసే ఆహారాన్ని విద్యార్థులు తీసుకుంటే కచ్చితంగా అనారోగ్యం బారిన పడతారని భావిస్తూ కిచెన్ ను సీజ్ చేశారు. ఇక్కడి నుంచే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల్లోని వేల మంది విద్యార్థులకు భోజనం తయారు చేసి సరఫరా చేస్తుంటారు. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన శ్రీచైతన్య యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
దీంతో కిచెన్ ను సీజ్ చేయడంతోపాటు లైసెన్స్ రద్దు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో మాదాపూర్ లోని ఖానామెట్ వద్ద ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ లైసెన్స్ రద్దు చేస్తూ వెనువెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక వేళ ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అక్కడే ఆహారాన్ని తయారు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విద్యాసంస్థపై అధికారులు కఠిన వైఖరి అవలంబించడం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల సంక్షేమ హాస్టళ్లలో ఆహారం కలుషితమై పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ వంట శాలలను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శ్రీచైతన్యపై యాక్షన్ తీసుకున్నారని చెబుతున్నారు.