మోదీ కళ్లకు ట్రంప్ 'గంతలు..'
మన దేశంలో ఏదైనా ప్రతిష్ఠాత్మక సదస్సు కోసం వివిధ దేశాల నేతలు పర్యటనకు వస్తే భారత్ లోని నగరాలను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తుంటారు.;
అమెరికా అంటే అత్యంత డెవలప్ అయిన దేశం.. రోడ్ల మీద మనుషుల కంటే కార్లు ఎక్కువగా కనిపించే అగ్ర రాజ్యం.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి సెటిలైన ప్రాంతం.. ప్రపంచ కుబేరులంతా ఉండే దేశం.. కానీ, అక్కడా పేదరికం ఉంటుంది.. పేదలు ఉంటారు.. బిక్షం అడుక్కునే వారు ఉంటారు.. రోడ్లపై గుంతలు కూడా ఉంటాయి. అది అమెరికా రాజధాని వాషింగ్టన్ అయినా సరే..
మన దేశంలో ఏదైనా ప్రతిష్ఠాత్మక సదస్సు కోసం వివిధ దేశాల నేతలు పర్యటనకు వస్తే భారత్ లోని నగరాలను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తుంటారు. పేదలు కనిపించకుండా చూస్తారు.. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తారు.. మరి అమెరికాలో.. ? సహజంగానే అత్యంత సుందరంగా ఉండే దేశం కాబట్టి ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదనుకుంటాం.. కానీ, మన దేశంలో లాంటి పరిస్థితే అక్కడా ఉందని ఊహించుకోవచ్చు. ఎందుకంటే..?
ట్రంప్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు.. ఎలాంటి అంశాన్నయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన తీరు.. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అంతూపంతూ లేదు. తాజాగా మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారాయన.
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. గత అధ్యక్షుడు బైడెన్ కంటే ట్రంప్ తోనే ఎక్కువ సంబంధాలున్న మోదీ.. 2020 ఎన్నికల సందర్భంగా ట్రంప్ కోసం ప్రచారం చేశారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యారు. ట్రంప్ రెండోసారి గెలిచి అధ్యక్షుడైన నెలలోపే మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలో తనను కలిసేందుకు రాజధాని వాషింగ్టన్ కు వచ్చిన మోదీ, ఇతర ప్రపంచ నేతలకు టెంట్లు, గ్రాఫిటీ (రాతలు), రోడ్లపై గుంతలు కనిపించకూడదని ట్రంప్ నిర్ణయించారట. అందుకోసం వాషింగ్టన్ డీసీని సుందరంగా తీర్చిదిద్దారట.
పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రైం రేట్ అదుపులో ఉండేలా చర్యలు తీసుకున్నారట. పేదలు (హోం లెస్ పీపుల్) వేసుకున్న గుడారాలను తొలగించారట. మొత్తమ్మీద ప్రపంచం చర్చించుకునే స్థాయి రాజధాని తమ లక్ష్యమని ట్రంప్ చెప్పడం గమనార్హం.
మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, యూకే ప్రధాని స్టార్మర్ వీరంతా ఇటీవల అమెరికా వచ్చినప్పుడు టెంట్లు, గ్రాఫిటీ, విరిగిన బారికేడ్లు, రోడ్లపై గుంతలు లేకుండా చేయడంలో సక్సెస్ అయినట్లు ట్రంప్ చెప్పారు.