కర్నూలులో ఫ్యాక్షన్ పాలిటిక్స్.. టీడీపీ నేత హత్య
కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను కొందరు వ్యక్తులు.. వేట కొడవళ్లతో నరికి చంపారు. శనివారం ఉదయం టిఫిన్ చేసేందుకు తన ఇద్దరు అనుచరులతో సంజన్న బయటకు వచ్చారు.;
కర్నూలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది. రాజకీయ హత్యలకు ఒకప్పుడు కేంద్రంగా మారిన కర్నూలు జిల్లాలో తాజాగా మరో హత్య జరిగింది. శనివారం ఉదయం.. ఇంటి నుంచి బయటకు వచ్చిన టీడీపీ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు.. నడిరోడ్డుపై వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు.. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
ఏం జరిగింది?
కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను కొందరు వ్యక్తులు.. వేట కొడవళ్లతో నరికి చంపారు. శనివారం ఉదయం టిఫిన్ చేసేందుకు తన ఇద్దరు అనుచరులతో సంజన్న బయటకు వచ్చారు. సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకునేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో నాలుగు బైకులపై వచ్చిన 8 మంది వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తొలుత బైక్‌తో ఢీ కొట్టారు. దీంతో రోడ్డుపై పడిపోయిన ఆయనను విచక్షణా రహితంగా వేట కొడవళ్లతో పొడిచి చంపారు.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు సంజన్న వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన రాజకీయ విభేదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. అయితే.. వైసీపీ నుంచి బయటకు వచ్చాక.. ఆ పార్టీ నేతల నుంచి పలు మార్లు తన భర్తకు బెదిరింపులు వచ్చాయని సంజన్న భార్య ఆరోపిస్తున్నారు. సంజన్న మృతదేహాన్ని కర్నూలు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మాకు సంబంధం లేదు!
సంజన్న హత్య జరిగిన వెంటనే స్థానిక వైసీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు., తమ పార్టీ నాయకులకు సంజన్నహత్యతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి ఏడాది పైనే అయిపోయిందని.. తమకు, ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొంది. కొందరు టీడీపీ నాయకులు సంజన్నపై కక్ష పెంచుకున్నారని.. వారే ఈ హత్యను చేయించి ఉంటారని ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.