వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా : సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టులు అంటే ఎవరు? ఎవరు నాన్ జర్నలిస్టులు అన్నదానిపై జర్నలిస్టు సంఘాలు తనకు క్లారిటీ ఇవ్వాలంటూ అసెంబ్లీ వేదికగా కోరారు.;

Update: 2025-03-15 11:06 GMT

యూట్యూబ్, సోషల్ మీడియాలో పోస్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శివాలెత్తారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరు పడితే వారు ఐడెంటిటీ లేకుండా ట్యూబ్ అని పెట్టి తిడుతుంటే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడిాయాలో జరుగుతున్న విష ప్రచారంను అడ్డుకొని తీరుతామంటూ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్ లు.. దానికి కారణాలను పరోక్షంగా ప్రస్తావించారు. జర్నలిస్టులు అంటే ఎవరు? ఎవరు నాన్ జర్నలిస్టులు అన్నదానిపై జర్నలిస్టు సంఘాలు తనకు క్లారిటీ ఇవ్వాలంటూ అసెంబ్లీ వేదికగా కోరారు. ఇక జర్నలిస్టులు కాని వారిని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, కుటుంబ సభ్యులు, మహిళల గురించి ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నందునే సహనం వహిస్తున్నానని, లేకపోతే ఒక్కరిని కూడా బయట తిరగనివ్వబోనని ఆయన హెచ్చరించారు. తన తల్లిపైన, చెల్లిపైన ఇలాంటి పోస్టులు పెడితే ఎవరూ ఊరుకోరని ఆయన ప్రశ్నించారు. ఇకపై హద్దులు దాటితే ఊరుకునేది లేదని, ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముసుగు వేసుకుని వస్తే వారి గుడ్డలు ఊడదీసి కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సంస్కృతి ఒక విష సంస్కృతి అని సీఎం అభివర్ణించారు. తనను తిట్టిన తిట్లను ఇతరులకు పెట్టి చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. తాను ఓపికగా ఉన్నానని, లేకపోతే ఒక్కొక్కరు బయట తిరగలేరని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పిల్లలకు ఈ విషయాలు చెప్పాలని సూచించారు. హద్దులు దాటితే సహించేది లేదని, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోనని తేల్చి చెప్పారు. కోర్టుకు వెళ్తే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారని, అవసరమైతే చట్టాన్ని కూడా సవరిస్తామని ఆయన అన్నారు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేయడం ఏమి బాగోలేదని ప్రశ్నించారు. ఇవన్నీ వింత పోకడలని విమర్శించారు. కేసీఆర్ తన పిల్లలకు బుద్ధి చెప్పాలని, ఇకపై ఇలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమస్యలు, తప్పులు ఉంటే చెప్పాలని, వాటిని సరిదిద్దుకుంటామని సీఎం అన్నారు. మీడియా సంఘాలు కూడా ఈ విషయంపై స్పందించాలని కోరారు. కుర్చీలో ఉన్నానని ఊరుకుంటారని అనుకుంటున్నారని, కానీ చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై చర్చ పెట్టాలని, విచ్చలవిడితనం ఆగాలని ఆయన కోరారు. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభలో దీనిపై చట్టం చేద్దామని, ఇది తన ఒక్కరి ఆవేదన కాదని, అందరి ఆవేదన అని సీఎం అన్నారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని, స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News