క్లారిటీ వచ్చేసింది..కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ
అధికార లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన మార్క్ కార్నీనే తదుపరి కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.;
భారత వ్యతిరేక గళాన్ని వినిపించటమే కాదు.. తన దూకుడు నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఆయన స్థానంలో తదుపరి కెనడా ప్రధాని ఎవరన్న దానిపై చాలానే విశ్లేషణలు సాగాయి. తాజాగా..వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త ప్రధాని ఎవరన్న దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అధికార లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన మార్క్ కార్నీనే తదుపరి కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.
జనవరిలో తన ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయటంతో.. అధికార లిబరల్ పార్టీకి కొత్త సారధి అవసరమయ్యాడు. ఈ నేపథ్యంలో పలువురు రంగంలోకి వచ్చారు. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. ప్రధాని రేసులో రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించిన మార్క్.. కొత్త అధినాయకుడిగా అవతరించారు.
తాజా ఎన్నికతో తొమ్మిదేళ్లుగా కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో పాలనకు తెర పడినట్లైంది. తాజాగా జరిగిన కెనడా ప్రధాని ఎన్నికల్లో మొత్తం 1.5 లక్షల మంది పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. మార్క్ కు 1,31,674 ఓట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ కు 11,134 ఓట్లు.. కరినా గౌల్డ్ కు 4,785 ఓట్లు వచ్చాయి. అంటే.. మొత్తం పోలైన ఓట్లలో 85.9 శాతం ఓట్లతో మార్క్ కార్నీ ఘన విజయం సాధించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా మీద సుంకాల షాకులు ఇస్తున్న వేళ.. అగ్రరాజ్యాన్ని సరైన రీతిలో డీల్ చేయాల్సిన కీలక తరుణంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కు.. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పాలి. మొత్తంగా 24వ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. 1965లో ఫోర్ట్ స్మిత్ లో పుట్టారు. హార్వర్డ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. పదమూడేళ్ల పాటు గోల్డ్ మన్ శాక్స్ లో పని చేశారు.
బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్ గా 2003లో ఎన్నికైన ఆయన.. ఆ తర్వాతి ఏడాది ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టారు. 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు. 2008-09ఆర్థిక సంక్షోభం వేళ దానికి తగిన రీతిలో దేశం వ్యవహరించేలా కీలక పాత్ర పోషించిన మార్క్.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు.
2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా ఎన్నికైన ఆయన.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ బ్యాంక్ కు మొట్టమొదటి నాన్ బ్రిటిష్ గవర్నర్ గా నిలిచారు. అంతేకాదు.. జీ7లో రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వాన్ని వహించిన ఘన చరిత్ర ఆయన సొంతం. ప్రస్తుతం కెనడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటివేళ.. మార్క్ గెలుపు ఆ దేశానికి ఏ మాత్రం మేలు చేస్తుందో చూడాలి. ట్రూడో రాజీనామా తర్వాత ప్రధాని రేసులో నలుగురు అభ్యర్థులు నిలవగా.. అత్యధిక ఓట్లు మాత్రమే కాదు.. అత్యధిక విరాళాల్ని సైతం సేకరించిన అభ్యర్థిగా మార్క్ కార్నీ నిలవటం గమనార్హం.
ఆయన కెరీర్ మొత్తాన్ని చూస్తే నామినేటెడ్ పోస్టులు తప్పించి.. ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా అనుభవం లేని ఆయన ఏకంగా కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య డయానా ఫాక్స్. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. క్రీడల పట్ల ఆసక్తిని ప్రదర్శించే మార్క్.. హాకీ.. రగ్బీ ఆటల్లో పాల్గొంటారు.
కెనడా ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే కెనడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చటం.. వాతావరణ మార్కుల సమస్యలను పరిష్కరించటం.. అంతర్జాతీయ సంబంధాల్ని బలోపేతం చేసుకోవటంతోపాటు.. ట్రంప్ షాకులకు ధీటుగా రియాక్టు కావాల్సి ఉంటుంది. మరోవైపు.. భారత్ తో సంబంధాలు ఎలా ఉంటాయన్న దానికి సమాధానం వెతికితే.. ట్రూడో మాదిరి దూకుడుగా ఉండకపోవచ్చంటున్నారు. ప్రస్తుతానికి మధ్యేమార్గంగా వ్యవహరిస్తారన్న అంచనా ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.