'మర్రి'.. వైసీపీ హర్రీ.. జంపింగ్ ఖాయం.. !
మర్రి రాజశేఖర్. పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన సీనియర్ నాయకుడు. గతంలో కాంగ్రెస్ తర్వాత.. వైసీపీ వైపు అడుగులు వేశారు.
మర్రి రాజశేఖర్. పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన సీనియర్ నాయకుడు. గతంలో కాంగ్రెస్ తర్వాత.. వైసీపీ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన కూడా.. జంపింగుల జాబితాలో చేరిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం లో కూటమిలో కంటే వైసీపీలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ మాటకు కట్టుబడిన మర్రి.. తన సీటును వదులుకున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి ఇస్తామన్న జగన్ మాటను ఆయన విశ్వసించారు.కానీ.. ఏళ్లు పూర్తియినా.. ఆయనకు మంత్రి యోగం చిక్కలేదు. చివరకు ఎన్నికలకు ముందు.. ఎమ్మెల్సీని చేశారు. ఈ అసంతృప్తి.. మర్రిని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇదిలావుంటే.. ఆయనకు ఫ్యామిలీ ప్రెండ్ గా ఉన్న వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత కూటమి యువ ఎంపీ.. ఒకరు మర్రికి టచ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. వైసీపీ నుంచి బయటకు రావాలని యువ ఎంపీ సూచించినట్టు కూడా ప్రచారంలో ఉంది.
దీనికి మర్రి కూడా ఓకే చెప్పారని తెలిసింది. వైసీపీలో ఉన్న తనకు చిలకలూరిపేట ఇంచార్జ్ పగ్గాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ, మాజీ మంత్రి విడదల రజనీకే మరోసారి చిలకలూరి పేట పగ్గాలు దక్కేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోమర్రి కూడా.. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉన్నారు. దీంతో పార్టీ మారిపోతేనే బెటర్ అని ఆయన నిర్ణయించుకున్నట్టు ప్రచారం ఉంది. అయితే.. దీనిపై కేవలం పార్టీ వర్గాల మధ్య మాత్రమే చర్చ సాగుతోంది.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో దీనిపై ఇంకా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం లేదు. మరోవైపు.. మర్రి రాకను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కానీ, ఎంపీ మాత్రం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మర్రిని లాగేయడం ద్వారా.. తన సామాజిక వర్గం పట్టు పెంచుకోవ డంతోపాటు.. పార్టీలోనూ దూకుడు పెంచుకోవాలన్నది సదరు ఎంపీ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. ఎలా చూసుకున్నా.. మర్రి జంప్ మాత్రం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.