సిరి 'స్పై'.. రూ.814 కోట్ల దావాకు యాపిల్ రియాక్షన్ ఇదే

కానీ.. అమెరికాలో మాత్రం అందుకు భిన్నంగా యాపిల్ సిరి మీద ఒక ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది.

Update: 2025-01-05 07:30 GMT

టెక్నాలజీ అంటూ మురిసిపోయే మనకు భిన్నంగా పశ్చిమ దేశాలకు చెందిన కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి వారి పుణ్యమా అని షాకింగ్ అంశాలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకే చెందుతుంది. ప్రపంచ ప్రసిద్ధయాపిల్ సంస్థ తన వర్చువల్ అసిస్టెంట్ సిరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిరి.. సిరి.. అంటూ కమాండ్లు ఇచ్చేస్తూ.. దాని స్పందన చూసి ముచ్చట పడిపోయేటోళ్లను వేలాది మందిని చూస్తాం. కానీ.. అమెరికాలో మాత్రం అందుకు భిన్నంగా యాపిల్ సిరి మీద ఒక ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది.

దీని సారాంశం ఏమంటే.. అనుమతి లేకుండానే ‘సిరి’.. మైక్రో ఫోన్ సంభాషణలను రికార్డు చేసిందని.. ఆ సమాచారాన్ని ఇతరులతో (ప్రకటన సంస్థలు.. లేదంటే ప్రైవేటు సంస్థలు) పంచుకునే అవకాశం ఉందని ఆరోపించింది. అనుమతి లేకుండా ఇలా చేయటం చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. ఇందుకు పరిహారం చెల్లించాల్సిందేనని యాపిల్ పై కేసు వేశారు. సిరి.. స్పైగా మారిందని.. ఐఫోన్లు.. ఇతర డివైజ్ ల యూజర్లపై సిరి నిఘా పెట్టినట్లుగా సదరు కేసులో ఆరోపించారు.

ఇది వినియోగదారుల ప్రైవసీకి.. వారి నమ్మకాన్ని యాపిల్ వమ్ము చేయటమేనని పేర్కొంది. ఈ కేసును ధ్రువీకరించిన యాపిల్.. అందులో పేర్కొన్న అంశాల్ని మాత్రం ఖండించింది. యూజర్ ప్రైవసీ విషయంలో తాము కమిట్ మెంట్ తో ఉన్నట్లుగా పేర్కొంది. అదే సమయంలో ఈ కేసును సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో పిటిషనర్ దారు పేర్కొన్నట్లుగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతూ.. 95 మిలియన్ డాలర్ల(మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.814 కోట్లు) ను చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లుగా పేర్కొంది.

అయితే.. ఈ సెటిల్ మెంట్ కు సంబంధించిన పిటిషన్ ఈ వారం మొదట్లో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. దీన్ని న్యాయమూర్తి ఓకే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కేసు పరిష్కారమైతే.. 2014 సెప్టెంబరు నుంచి 2022 చివరకు వరకుయాపిల్ సిరి ఎనేబుల్డ్ పరికరాలు కలిగి ఉన్న లేదంటే వాటిని కొనుగోలు చేసిన యూజర్ల (అమెరికాలో మాత్రమే)కు ఈ సెటిల్ మెంట్ మొత్తాన్ని షేర్ చేస్తారని చెబుతున్నారు. మరి.. దీనికి ఫెడరల్ కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News