తాజా వ్యాఖ్యతో లెక్కలు సరి చేసిన కేటీఆర్.. తెలివే తెలివి!
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు కావటం.. జైల్లో ఉండటం తెలిసిందే
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు కావటం.. జైల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుకు నిరసనగా.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. ర్యాలీలు.. నిరసనలు చేపట్టటం తెలిసిందే. దీనిపై కాస్త ఆలస్యంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. 'ఏపీలో చంద్రబాబు అరెస్టు జరిగితే.. తెలంగాణలో నిరసనలు ఏమిటి? కావాలంటే వెళ్లి ఏపీలో చేసుకోవాలి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయటం.. కేటీఆర్ మాటలు ప్రతికూల ప్రభావాన్ని చూపటం తెలిసిందే.
ఇతర రాష్ట్రానికి సంబంధించిన పంచాయితీని తెలంగాణ మీద ఎందుకు రుద్దుతారన్న కేటీఆర్ మాటల్ని తప్పు పడుతూ.. తాడేపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని చూపిస్తూ.. హైదరాబాద్ లో నిరసన తెలుపుతున్నది ఇందుకేనంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ వ్యతిరేకత వ్యాఖ్యలు.. పోస్టులు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం సభకు హాజరైన మంత్రి కేటీఆర్.. తమకు రాముడైనా.. క్రిష్ణుడైనా ఎన్టీఆరేనంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చగా మారాయి.
చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ మాటలతో జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసే ఎత్తుగడలో భాగంగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే రోజు మంత్రి హరీశ్ వేరే చోట జరిగిన కార్యక్రమంలో పాల్గొని.. చంద్రబాబు అరెస్టు బ్యాడ్ లక్ గా పేర్కొన్నారు. తెలంగాణలోని సెటిలర్లు.. అందునా తెలుగుదేశం పార్టీని అభిమానించే వారిని వ్యతిరేకులుగా చేసుకోవటం తప్పించి మరింకేమీ లేదన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాటలు ఉన్నాయన్న విమర్శ వినిపించింది. దీన్ని న్యూట్రలైజ్ చేసుకోవటానికి ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినట్లుగా చెప్పాలి.
అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేటీఆర్ మిస్ అయిన పాయింట్ ఒకటుందన్న వాదన మొదలైంది. ఎంతసేపటికి చంద్రబాబు.. టీడీపీ.. ఆ పార్టీ సానుభూతిపరులేనా? తెలంగాణలో జగన్ అభిమానులు.. వైసీపీ సానుభూతిపరుల మాటేంటి? అన్నది ప్రశ్నగా మారుతూ.. తమకే మాత్రం ప్రాధాన్యం ఇవ్వని పక్షంలో తాము తమ సత్తా చాటుతామన్న వాదన సోషల్ మీడియాలో షురూ అయ్యింది. దీంతో.. ఏపీకి చెందిన రెండు కీలక పార్టీలకు సంబంధించిన సానుభూతిపరులు తమకు ముఖ్యమే అన్న విషయాన్ని స్పష్టం చెప్పే పనిలో భాగంగానే.. జగనన్నకు చెప్పి భూములు ఇప్పిస్తానంటూ పెట్టుబడిదారులతో మంత్రి కేటీఆర్ నోటి నుంచి మాట వచ్చినట్లుగా చెబుతున్నారు.
మొన్న ఎన్టీఆర్ ప్రస్తావన.. తాజాగా ఏపీ సీఎం జగనన్న అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. తెలంగాణలోని ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు మొత్తం తమతోనే ఉండాలన్నది మంత్రి కేటీఆర్ ఎత్తుగడగా చెప్పాలి. ఇందులో భాగంగా ఆయనీ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. మంత్రి కేటీఆర్ వ్యూహం ఎంతమేర వర్కువుట్ అవుతుందో చూడాలి.