సీతక్క కుమారుడు పోటీ అక్కడి నుంచేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీతక్క వచ్చే ఎన్నికల్లోనూ ములుగు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు

Update: 2023-08-26 07:15 GMT

సీతక్క.. పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మావోయిస్టుగా, గిరిజన ప్రతినిధిగా ఆమెకు ఎంతో గుర్తింపు ఉంది. మరోవైపు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన ములుగు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కరోనా సమయంలో, గోదావరి వరదలప్పుడు సీతక్క ఆ కొండ కోనల్లో, కాలి బాటలు కూడా లేని దారుల్లో ప్రజలకు విశేష సేవలు అందించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీతక్క వచ్చే ఎన్నికల్లోనూ ములుగు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆమెకు దాదాపు సీటు ఖాయమైనట్టే. కాగా మరోవైపు ములుగులో సీతక్కపై పోటీకి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఎస్టీ మహిళనే బరిలోకి దింపారు. ప్రస్తుతం ములుగు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్న బడే నాగజ్యోతిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు.

అయితే సీతక్కను ఓడించడం చాలా కష్టమనే విషయం కేసీఆర్‌ కు తెలుసు. ఎందుకంటే ములుగులో సీతక్క చేసిన సేవలు అటువంటివి. ఇప్పటివరకు ప్రభుత్వం, అధికారులు కూడా వెళ్లలేని కుగ్రామాలకు సైతం సీతక్క వెళ్లగలరు. మావోయిస్టు ఉద్యమంలో ఆమె పనిచేసి ఉండటంతో అడవిలో ప్రతి బాట, దారి ఆమెకు అవగతమే.

ఈ క్రమంలోనే గోదావరి వరదలు ములుగు నియోజకవర్గంలో గ్రామాలను చుట్టుముట్టినప్పుడు, ప్రజలు విష జ్వరాల బారినపడ్డప్పుడు, కరోనా సమయంలోనూ సీతక్క విశేష సేవలు అందించారు. స్వయంగా నిత్యావసర వస్తువులను తన తలపై పెట్టుకుని నడుచుకుంటూ మోసుకుపోయారు. అలాగే నిండు గోదావరిలో పడవపై ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రయాణించి ప్రజలకు అండగా నిలిచారు.

ఈ నేపథ్యంలో మరోమారు సీతక్క విజయం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా సీతక్కను ఓడించడానికి కేసీఆర్‌ చాలా పెద్ద ఎత్తునే కసరత్తు చేశారు. చందూలాల్‌ లాంటి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ చివరకు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బడే నాగజ్యోతిని అభ్యర్థిగా ప్రకటించారు.

కాగా సీతక్క కుమారుడిని కూడా కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలుపుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రజాసేవ చేయడానికి సీతక్క తన కుమారుడు సూర్యను గతంలోనే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సూర్య ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పికపాక అసెంబ్లీ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పీసీసీకి తాజాగా దరఖాస్తు కూడా చేసుకోవడం విశేషం. అటు కాంగ్రెస్‌ అధిష్టానం, ఇటు తెలంగాణ సీనియర్‌ నేతలు కూడా సూర్య అభ్యర్థిత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాక్‌ నడుస్తోంది.

పినపాక సీటుపై దృష్టి సారించిన సీతక్క కుమారుడు సూర్య గత కొన్ని నెలలుగా పినపాకలోనే తిష్టవేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. నిత్యం జనాల్లో తిరుగుతున్నారు. రోజుకో మండలాన్ని ఎంచుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

కాగా ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన పినపాకలో 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై 19,565 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే.. కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు.

రేగా కాంతారావు బీఆర్‌ఎస్‌ లో చేరిపోవడంతో పినపాక కాంగ్రెస్‌ కార్యకర్తలకు.. ప్రజలకు సీతక్క కుమారుడు సూర్య అండగా నిలుస్తూ వస్తున్నారు.అందులోనూ యువకుడు కావడంతో యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు. సూర్యను కచ్చితంగా గెలిపించుకుంటామని.. ప్రజా సమస్యలను పరిష్కరించే నేత కావాలని అక్కడి ప్రజలు కూడా కోరుతున్నారు. దీంతో ములుగులో తల్లి సీతక్క, పినపాకలో కుమారుడు సూర్య కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించడం ఖాయమని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News