త్వరలో తెలుగులోనూ ఎంబీబీఎస్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

అయితే, ఇలాంటి పరిస్థితిని నివారిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-13 11:57 GMT

కార్పొరేట్ ధోరణి పెరిగిపోయి అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నా.. ఇప్పటికీ వైద్యులు అంటే సమాజంలో చాలా గౌరవం. డబ్బు కల్చర్ కారణంగా అపవాదులు వస్తున్నా.. వైద్యులను మనందరం చాలా ఉన్నతంతా చూస్తాం. అలాంటి వైద్యులు అయ్యేందుకు ఎంబీబీఎస్ చదువు ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంది. భారత్ వంటి అనేక ప్రాంతీయ భాషలున్న దేశంలో ఇంగ్లిష్ మీడియంలో మొదటినుంచి చదివిన విద్యార్థులు తక్కువగా ఉంటారు. పైగా వీరంతా ఒక్కసారిగా ఎంబీబీఎస్ కు వచ్చి ఇంగ్లిష్ మీడియంలో చదవడం అంటే చాలా కష్టమైనదే. ప్రతిభావంతులు మాత్రమే అక్కడ వరకు వస్తారు ఏమంత విమర్శలు రావడం లేదు. అయితే, ఇలాంటి పరిస్థితిని నివారిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీనే ప్రకటించారు.

హిందీ సహా అనేక భాషల్లో..

దేశంలో త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎంబీబీఎస్ సీట్లను లక్ష సంఖ్యలో పెంచామని మోదీ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బిహార్‌ లోని దర్భంగలో నిర్వహించిన సభలో ప్రధాని బుధవారం ప్రసంగించారు. దర్భంగలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే మెడికల్ సీట్ల గురించి ప్రకటన చేశారు. లక్షన్నరకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని ప్రధాని తెలిపారు. 4 కోట్ల మంది ప్రజలు వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు మేలే..

కేంద్రం గనుక ప్రాంతీయ భాషల్లోనూ ఎంబీబీఎస్ విద్యను అందుబాటులోకి తెస్తే అది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు చాలా మేలు చేయనుంది. ఎందుకంటే.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వాల హయాంలో భారీగా మెడికల్ కాలేజీలు మంజూరైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. కొత్తగా అనుమతులు పొందిన కాలేజీలు, సీట్లు అప్‌గ్రేడేషన్‌ అయిన కాలేజీలు, సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ వెబ్‌ సైట్‌ లో ఉంచింది. కొత్త కాలేజీల్లో 6,850 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులివ్వగా మరో 30 కాలేజీల్లో అదనంగా 1,872 సీట్ల పెంపునకు ఓకే చెప్పింది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో 8,722 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. కొత్త కాలేజీల్లో దక్షిణాది రాష్ట్రాలకు 17 మంజూరు కాగా అత్యధిక కాలేజీలు తెలంగాణకే దక్కాయి. ఇక ఏపీలో వైసీపీ సర్కారు ఉండగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

అద్భుత అవకాశమే..

మొత్తానికి ప్రాంతీయ భాషల్లో వైద్య విద్య అనేది అద్భుత అవకాశం అనే చెప్పాలి. ప్రతిభ ఉండీ.. ఇంగ్లిష్ భయంతోనో, మరే ఇతర కారణాలతో ఎంబీబీఎస్ చదవడం మానుకునేవారు చాలామంది ఉంటారు. ఇలాంటివారికి కేంద్రం చేస్తున్న కొత్త ఆలోచన మేలు చేకూర్చనుంది.

Tags:    

Similar News