మోడీ చేయి వదలనంటోన్న నితీష్ కుమార్
ఈ క్రమంలోనే బిజెపితో చేయి కలిపిన తర్వాత తొలిసారిగా ఔరంగాబాద్ లో జరిగిన ఓ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు
బీహార్ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత నితీష్ కుమార్ ఇటీవల అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. 11 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక రాజకీయ నేతగా నితీష్ రికార్డు సాధించారు. అయితే, పొత్తులను చిత్తు చేస్తూ కూటమిలోని మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తూ నితీష్ కుమార్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఉండబట్టే ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కాగలిగారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ విమర్శలను పట్టించుకోని నితీష్ కుమార్ గతంలో విభేదించిన బిజెపితోనే మరోసారి జతకట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
ఈ క్రమంలోనే బిజెపితో చేయి కలిపిన తర్వాత తొలిసారిగా ఔరంగాబాద్ లో జరిగిన ఓ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. గతంలో మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు తాను కనిపించకుండా పోయానని, అయితే ఇకపై తాను ఎక్కడికి వెళ్ళబోనని, మోడీతోనే ఉంటానని నితీష్ కుమార్ అన్న మాటలు వైరల్ గా మారాయి.
ఇకపై మోడీతో దోస్తీ పక్కా చేసుకున్నా అంటూ నితీష్ కుమార్ చెప్పిన మాటలకు మోడీ పగలబడి నవ్వడం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఇటీవల బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే లెక్కచేయకుండా గతంలో దుమ్మెత్తి పోసిన ఎన్డీఏ కూటమితోనే నితీస్ జట్టు కట్టడం విమర్శలకు తావిచ్చింది.