జిన్ పింగ్.. కిమ్.. మోదీ.. టూర్ గేమ్ చేంజర్..: రష్యా.. ఔను అది ఆ దేశానికే..

2022 ఫిబ్రవరిలో మొదలైంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఇప్పటికీ కొలిక్కిరాలేదు.

Update: 2024-07-11 11:28 GMT

2022 ఫిబ్రవరిలో మొదలైంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఇప్పటికీ కొలిక్కిరాలేదు. వేలాది ప్రాణాలు పోయాయి.. ఆస్పత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలు.. ఇలా అన్నిటి మీదా దాడులు చేసింది రష్యా.. ఉక్రెయన్ ను సర్వనాశనం చేసిందనే చెప్పాలి. సైనిక చర్య అంటూ మొదలుపెట్టి.. మౌలిక వసతులను ధ్వంసం చేసిన రష్యా వైపు ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ పెద్ద దేశమూ నిలవలేదు. సహజంగానే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు రష్యాను సమర్థించవు. వీటి ఆధ్వర్యంలోని నాటో కూటమి రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కు ఆయుధాలను ఇస్తోంది. చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ మాత్రమే రష్యాను సమర్థిస్తూ ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి.

మోదీ ఏం చెప్పదల్చుకున్నారు?

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని భారత్ తొలి నుంచి తనదైన శైలిలో చూస్తోంది. ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని మోదీ స్వయంగా పలుసార్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఓటింగ్ సందర్భంగా భారత్ తన వైఖరిని చాటిచెప్పింది. అయితే, మూడో విడత ప్రధాని అయ్యాక మోదీ తొలి టూర్ ను రష్యాలోనే చేశారు. ఇది ముందే అనుకున్నది అయినా.. యుద్ధానికంటే మాత్రం ముందు కాదని చెప్పాలి. ఇక ప్రపంచంలో మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్న పుతిన్ ను మోదీ ఆలింగనం చేసుకోవడమే కాదు.. అణు సహకారానికి సంబంధించి ఒప్పందాలూ చేసుకున్నారు. ఒకే కారులో ప్రయాణించారు. మరోవైపు యుద్ధం మొదలయ్యాక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉత్తర కొరియా నియంత్ కిమ్ తప్ప మరే దేశాధినేత రష్యాను సందర్శించలేదు. అలాంటిది ప్రపంచంలోనే తనదైన ముద్ర వేస్తున్న భారత్ కు ప్రతినిధిగా మోదీ వెళ్లి పుతిన్ ఆలింగనం చేసుకోవడం తప్పుడు సంకేతాలను పంపింది. దీనికితగ్గట్లే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీని తీవ్రంగా తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

చరిత్రాత్మకమే.. మనకు కాదు..

మోదీ రష్యా పర్యటన, పుతిన్‌ తో చర్చలను చరిత్రాత్మకం అని రష్యా అభివర్ణించింది. మోదీ పర్యటనను గేమ్‌ చేంజర్‌ గా పేర్కొంది. రష్యా సైన్యంలో సహాయకులుగా ఉన్న భారతీయులను పంపేయడంతో పాటు పలు కీలకాంశాలపై పుతిన్, మోదీ దృష్టిసారించినట్లు భారత్‌ లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. అంతర్జాతీయ ఘర్షణ పరిస్థితులను పక్కనపెట్టిన మోదీ.. రష్యాలో పుతిన్‌ తో చర్చలు జరిపారని కొనియాడింది. ఔను.. రష్యా కోణంలో చూస్తే మోదీ టూర్ గేమ్ చేంజర్. ఎందుకంటే.. దాదాపు ప్రపంచం వెలివేసిన పరిస్థితుల్లో మోదీ రష్యాలో పర్యటించారు. తద్వారా తాను యుద్ధంపై ఇప్పటివరకు చెబుతున్న దానికి భిన్నంగా వ్యవహరించారు. ఈ లెక్కన రష్యాను పరోక్షంగా సమర్థించిన నేతగానూ నిలిచారంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన మోదీ టూర్ రష్యాకు మాత్రమే గేమ్ చేంజర్.

Tags:    

Similar News