మోడీ స్పీచ్ లో కొత్తదనం లేదా ?
2014 నాటికి యూపీఏ ప్రభుత్వం అధికారంలో రెండోసారి ఉండడంతో పాటు ఆ ప్రభుత్వం మీద వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీ అవినీతి ఆరోపణలు అన్నీ కలసి మోడీకి బాగా ఉపయోగపడ్డాయి.
మోడీ 2013లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పటికి పదకొండేళ్లు అయింది. మోడీ తొలి స్పీచ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత గంగా ప్రవాహంగా ఆయన నోట వచ్చే మాటలు ఇచ్చే ప్రసంగాలకు జనాలు సమ్మోహితులు అయ్యారు. 2014 నాటికి యూపీఏ ప్రభుత్వం అధికారంలో రెండోసారి ఉండడంతో పాటు ఆ ప్రభుత్వం మీద వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీ అవినీతి ఆరోపణలు అన్నీ కలసి మోడీకి బాగా ఉపయోగపడ్డాయి.
దేశానికి మోడీ లాంటి లీడర్ దొరికారు అని అంతా సంబరపడ్డారు. మోడీ కాంగ్రెస్ ని ఎన్ని విమర్శలు చేసినా జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. అయితే 2019 నాటికి ఆ ఊపు తగ్గింది. కాంగ్రెస్ మీద బీజేపీ ఆ ఎన్నికల్లో ముఖా ముఖీ పోరు సాగించలేదు. అదే టైం లో పుల్వామా దాడులను భావోద్వేగాలను దేశభక్తి వంటి అంశాలను ఉపయోగించుకుంది. ఫలితంగా అధికారంలోకి వచ్చింది. విపక్షాల అనైక్యత కూడా దానికి అసలైన కారణం.
ఇక 2024 నాటికి చూస్తే విపక్షాలు అన్నీ పట్టు బిగించాయి. గట్టిగానే అవి నిలబడ్డాయి. దాంతో ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కలేదు. ఎన్డీయే మిత్రులతో కలసి మూడవసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంతో పోలిస్తే మోడీ ఇమేజ్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది అని అంటున్నారు.
మోడీ ఎంతసేపూ కాంగ్రెస్ ని ఆడిపోసుకోవడమే తప్ప తాము సాధించిన విజయాలు చెప్పకపోవడం దేశానికి పదేళ్ళ కాలంలో బీజేపీ ఏమి చేసింది అన్న దాని మీద ఏ రకమైన చర్చా పెట్టకపోవడం వంటివి 2024 ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాయి. కాంగ్రెస్ పదేళ్ళుగా అధికారంలో లేదు. అటువంటి పార్టీ విషయంలో ఇంకా విమర్శలు చేస్తూ కాలం గడపడం అవసరమా అన్న చర్చ అయితే జనాల్లో ఉంది.
మాట్లాడితే చాలు ఎమర్జెన్సీ అంటూ కాంగ్రెస్ మీద మోడీ చేస్తున్న విమర్శలు కూడా జనంలోకి వెళ్లకపోగా రివర్స్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ అన్నది ఇప్పటికి యాభై ఏళ్ల నాటిది. అప్పటికి పదేళ్ల లోపు వయసు ఉన్నవారు అంతా ఇపుడు పెద్ద వారుగా ఉన్నారు వారికి సైతం ఎమర్జెన్సీ మీద పూర్తి అవగాహన లేదు. మిగిలిన వారు సీనియర్ సిటిజెన్లకు మాత్రమే ఎమర్జెన్సీ అంటే అర్ధం అవుతుంది.
వారు కాకుండా దేశంలోని అత్యధిక శాతానికి దాని మీద అవగాహన ఆసక్తి రెండూ తక్కువే. ఈ నాటి యువత పాత విషయాల కంటే తమకు ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నదే చూస్తోంది. అదే విధంగా తమ కోసం ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుంది అన్నది ఆలోచిస్తుంది. ఇక బీజేపీకి కాంగ్రెస్ ని విమర్శించే చాన్స్ అయితే లేదు పదేళ్ల పాటు ఒక పార్టీ అధికారంలో ఉందంటే మంచి చెడ్డలకు ఆ పార్టీయే బాధ్యత వహించాలి.
ఇంకా కాంగ్రెస్ అవినీతి అంటూ మోడీ చేస్తున్న ప్రసంగాలు కూడా జనాల్లోకి వెళ్లడం లేదు అని అంటున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభలో సోమవారం చేసిన ప్రసంగం తరువాత మంగళవారం ప్రధాని రిప్లై ఇచ్చే ఉపన్యాసంలో కాంగ్రెస్ అవినీతిని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ స్కాములు అంటున్నారు. ఉగ్రవాదం అంటున్నారు. ఇంకా చాలా మాట్లాడారు.
దీంతో మోడీ ప్రసంగాలలో కొత్తదనం ఏమీ లేదా అన్న చర్చ వస్తోంది. ఎంత సేపూ కాంగ్రెస్ ని నిందించడం ఎమర్జెన్సీ రోజులు అని చెప్పడం వంటివి తప్ప మరేమీ లేదా అని అంటున్నారు. మోడీ ఈ దేశానికి ప్రధాని. వరసగా మూడోసారి గెలిచిన నాయకుడు. ఆయన పదేళ్ల తన పాలన గురించి చెబుతూ భవిష్యత్తులో రానున్న అయిదేళ్ళలో తాము ఏమి చేస్తామన్నది చెప్పి ఉంటే జనాలకు కనెక్ట్ అయ్యేదని అంటున్నారు.
కానీ మోడీ తన సుదీర్ఘమైన స్పీచులలో కాంగ్రెస్ నే ఇంకా దుయ్యబెడుతూ పోతున్నారు. దీని వల్ల బీజేపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకపోగా కాంగ్రెస్ కే పొలిటికల్ గా అది మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇకనైనా మోడీ తన స్పీచులలో కొత్తదనాన్ని తీసుకుని రావాలని కోరుతున్నారు.