నిన్న హోరా హోరీ...నేడు భాయీ భాయీ !
అవును ఇది నిజం. నిన్నటి దాకా ఆ జెండా ఈ జెండా ఎదురుపడితే కొట్టుకున్నాయి.
అవును ఇది నిజం. నిన్నటి దాకా ఆ జెండా ఈ జెండా ఎదురుపడితే కొట్టుకున్నాయి. ఆ కండువా ఈ కండువా కనిపిస్తే కస్సుమన్నాయి. కానీ నేడు మాత్రం ఎంచక్కా పలకరించుకుంటున్నాయి. భాయీ భాయీగా కలసిపోతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే ప్రలోభ పర్వంలో రాజీల బాట కోసం అన్న మాట.
ఓట్లు కొనగూడదు, డబ్బులు పంచకూడదు. ఇది నియమం. రాజ్యాంగం ప్రకారం ఇలా చేస్తే అది అతి పెద్ద అపరాధం. కానీ అశ్వద్ధామ హతహా అన్న తీరున ఎవరికి వారుగా సన్నని గొంతుకలతో కంటి సైగలతో కోడ్ భాషలతో ఎన్నికల కోడ్ ని సైతం పక్కన పెట్టి నగదు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
ఆ పార్టీకీ ఈ పార్టీకి అసలు పడదు, కనిపిస్తే కొట్టుకుని చస్తారు. కానీ ఇదేమిటి ఇలా ఇద్దరూ వస్తున్నారు. అంటే అదే వారి మధ్య ఒక ఒప్పందం. నీవు పంచాల్సింది పంచుకో ఆనక నేను కూడా పంచుకుంటా. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న తీరున చాలా చాకచక్యంగా నగదు పంపిణీని చేసుకుంటూ పోతున్నారు.
ఒక పార్టీ కేడర్ ఒక వీధిలో పంచుతూంటే మరో పార్టీ క్యాడర్ పక్క వీధిలో పంపకాలకు తెర తీస్తుంది. వారు ఆ వీధి నుంచి ఈ వైపుకు వస్తే వీరు ఇక్కడ నుంచి అక్కడకు షిఫ్ట్ అవుతారు. ఇది రాజకీయ పార్టీల మధ్యన అందమైన అంగీకరంగా చూడాలి.
అదే సమయంలో ఓటర్ల తీరు కూడా వీరికి సహకరించేలా ఉంది. ఫలానా పార్టీ వారు డబ్బులు ఇచ్చారు. వారికే ఓటు వేస్తామని ఎవరూ చెప్పడం లేదు. తమ వద్దకు ఎన్ని పార్టీల వారు వస్తే అందరి వద్దా డబ్బులు హ్యాపీగా తీసేసుకుంటున్నారు మరి వారి ఓటు ఎవరికి పడుతుంది. ఏ పార్టీకి దక్కుతుంది. అంటే అదే బ్రహ్మ రహస్యం గా మారుతోంది.
అయితే దీని మీద కూడా అంగీకారాలు ఉన్నాయట. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే చెరి రెండూ రెండు పార్టీలకు అని అంటున్నారుట. అలా పార్టీలకు ఓటర్లకు కూడా ఉభయ కుశలోపరిగా అంగీకారం కుదిరాక ఇంటి దొంగలను ఈశ్వరుడు అయినా పట్టగలరా.
అయితే ఇక్కడే తమాషా ఉంది. నోట్ల కట్టలని తెచ్చి దానితో పాటుగా జాబితాలను ముందేసుకుని ఎంచక్కా ఇంటింటికీ పంచుతూంటే ఎందుకు నిఘా వ్యవస్థలకు కనిపించడంలేదు అని. అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుంటామని అధికారులు అంటున్నారు. మరి ఫిర్యాదులు చేయకుండా రాజకీయ పార్టీలే లోపాయి కారీ ఒప్పందాలకు వస్తే గుట్టుగానే కధ సాగిపోతుంది తప్ప ఏమీ హడావుడి ఉండడంలేదు. మొత్తానికి మెజారిటీ ఓటర్లకు డబ్బుల పంపిణీ చాలా చక్కగా సాఫీగా అందినట్లుగా భోగట్టాలు అయితే వస్తున్నారు. వారూ వీరూ తేడా లేదు. అందరూ ఆ తానులోని ముక్కలే.
దీని మీద మాత్రం ప్రజాస్వామ్య ప్రియులు మండిపడుతున్నారు. అధికారులు ఏమి చేస్తున్నారు అని నిందిస్తున్నారు. ఈ విధానం మంచిది కాదని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినా పాత సినిమాలో పాట మాదిరిగా డబ్బు అంటే ఎవరికైనా చేదా. అందుకే ముద్దుగా అందుకుంటున్నారు. ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని నవ్వుతూ స్వాగతిస్తున్నారు. ఇదంతా ఇచ్చునమ్మ వాయినం పుచ్చుకున్న వాయినం అని అనుకోవాల్సిందే అంటున్నారు తలపండిన ముదురు ముతక మనుషులు.