రాజ్యసభకు నాగబాబు...!?

జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుని కూటమి అధికారంలోకి వస్తే రాజ్యసభకు నామినేట్ చేస్తారు అన్న ప్రచారం ఇపుడు వినిపిస్తోంది

Update: 2024-03-14 18:30 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుని కూటమి అధికారంలోకి వస్తే రాజ్యసభకు నామినేట్ చేస్తారు అన్న ప్రచారం ఇపుడు వినిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ టికెట్ ని నాగబాబు త్యాగం చేసి బీజేపీకి ఇచ్చారు అని ఒక వైపు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ప్రచారం కూడా సమాంతరంగా వస్తుంది.

ఇదంతా ఎందుకు అంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తుల కోసం తన అన్నయ్య నాగబాబుకు కూడా ఎంపీ టికెట్ ఇప్పించుకోలేక త్యాగం చేయాల్సి వచ్చింది అని అన్నారు. ఏపీ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదంతా చేశామని ఆయన చెప్పారు.

అదే టైం లో చాలా మంది జనసేన నేతలకు టికెట్లు రాకుండా పోయాయి. నాగబాబుకే టికెట్ ఇవ్వలేకపోయామని చెబితే మిగిలిన వారు కూడా సర్దుకుంటారు అన్న ఉద్దేశ్యంతో పాటు వ్యూహం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబుని ఈసారి వ్యూహాత్మకంగానే తప్పించారు అని అంటున్నారు.

ఆయన పోటీ చేసినా అనకాపల్లి టఫ్ సీటు. పూర్తి గ్రామీణ నేపధ్యం ఉన్న సీటు. నాన్ లోకల్స్ కి గెలుపు అవకాశాలు పెద్దగా ఉండవు. 2009లో అది అల్లు అరవింద్ విషయంలో ప్రజారాజ్యం ద్వారా రుజువు అయింది. దాంతో ఇటు సీటు త్యాగం చేశారన్న్ పేరుతో పాటు రాజ్యసభకు నామినేట్ కావచ్చు అన్న భరోసాతోనే వెనక్కి తగ్గారని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాగబాబు జనసేన 11వ వార్షికోత్సవాల సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తనకు పదవులు ఏవీ ఆశలు లేవని అన్నారు. తాను జనసైనికుడు అన్న పదవిని గొప్ప గౌరవంగా భావిస్తాను అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిని తన వారిని ఆస్తులు సినిమాలను వదులుకుని పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు అని కొనియాడారు.

పవన్ కళ్యాణ్ నిస్వార్ధపరుడైన నాయకుడు అని కీర్తించారు. ఆయన నాయకత్వంలో జనసైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప విషయం మరొకటి లేదని తనతో పాటు లక్షలాది మంది భావిస్తున్నారు అని టికెట్ రాని వారిని ఆశావహులను ఓదార్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద నాగబాబు పదవికి భరోసా ఉంది అన్న ప్రచారం సాగుతున్న నేపధ్యంలో తనకు పదవుల మీద ఆశ లేదని ఆయన అంటున్నారు.

మరో వైపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని వాటిలో కొన్ని జనసేనకు కేటాయిస్తారు అని కూడా ఆ పార్టీ ఆశావహులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అసంతృప్తులను జనసేనలో చల్లార్చే ప్రయత్నం అయితే నాగబాబు నుంచే మొదలైంది. అదే విధనా తొందరలో నాగబాబు పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News