ఆ ఊరు నాటు తుపాకుల అడ్డా... కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు!

2014 ఎన్నికల సమయంలో పోలీసులు ఇదే ప్రాంతంలో కార్డెన్ సర్చ్ నిర్వహించగా దాదాపుగా 70 నాటు తుపాకులు లభ్యమయ్యాయి.

Update: 2023-10-31 15:30 GMT

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో గతకొంత కాలంగా వరుసగా తుపాకీతో కాల్పులు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరిపై ఎవరికి కక్ష ఉన్నా... వెంటనే నాటు తుపాకీలకు పని చెబుతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు అయినా నాటు తుపాకీకే పని.. అక్రమ సంబంధాలకు సంబంధిచిన వ్యవహారమైనా దానితోనే పని... ఇలా వరుసగా అక్కడ నాటు తుపాకీ శబ్ధాలు వినిపిస్తున్నాయి! దీంతో పోలీసులు సెర్చ్ మొదలుపెట్టారు.

అవును... అయినదానికీ కానిదానికి తుపాకీలకు పనిచెబుతున్నారని.. అసలు వీరికి అవి ఎలా వస్తున్నాయని.. అసలు ఎన్ని ఉండి ఉండొచ్చని ఆలోచిస్తున్నారో ఏమో కానీ... పోలీసులు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... అహోబిలంలో ఈరోజు తెల్లవారుజామున రూరల్ పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి!

వివరాళ్లోకి వెళ్తే... నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈరోజు తెల్లవారుజామున డీఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. దీంతో... సుమారు 19 నాటు తుపాకులు, రెండు పిడిపాకులు ఈ కార్డెన్ సర్చ్ లో లభ్యమయ్యాయని తెలుస్తుంది. అయితే... అక్కడ నాటు తుపాకులు దొరకడం ఇదే తొలిసారు కాదు!

2014 ఎన్నికల సమయంలో పోలీసులు ఇదే ప్రాంతంలో కార్డెన్ సర్చ్ నిర్వహించగా దాదాపుగా 70 నాటు తుపాకులు లభ్యమయ్యాయి. అప్పటినుంచీ ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో నాటు తుపాకులు, పిడిపాకులూ లభ్యమయ్యాయని అంటున్నారు!

కాగా... ఈ ప్రాంతంలో 2012వ సంవత్సరంలో భార్యాభర్తలిద్దరూ ఇలాంటి నాటు తుపాకులతోనే కాల్చుకొని అక్కడికక్కడే చనిపోయారు. తాజాగా ఈనెల 15వ తేదీన అక్రమ సంబంధం కారణంగా రామాంజనేయులు అనే వ్యక్తి నాటు తుపాకితో నరసింహను కాల్చబోతే అది గురి తప్పి పెద్దన్న అనే వ్యక్తికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఇక్కడ నాటు తుపాకీ కల్చర్ మరీ కామన్ అయిపోయేలా ఉందనే ఆందోళనతో పోలీసులు అప్పుడప్పుడూ ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుంటారు.

అడవి సమీపంలోనే ఉండడంతో వేట కోసం ఈ నాటు తుపాకుల్ని వారే సొంతంగా తయారు చేసుకుంటున్నారట. అయితే... కేవలం అడవిలో జంతువుల్ని వేటాడడానికి మాత్రమే ఉపయోగించాల్సిన ఈ నాటు తుపాకుల్ని పాత కక్షలకు వాడుతున్నారని చెబుతున్నారు. దీంతో... అప్రమత్తమైన పోలీసులు ఇలా గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి నాటు తుపాకులు స్వాధీన పరచుకొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Tags:    

Similar News