రాత్రికి రాత్రే సంపాదించలేదు.. 33 ఏళ్ల కష్టార్జితం : మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు ప్రస్థానంపై ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2025-01-03 10:21 GMT

దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు ప్రస్థానంపై ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు అవినీతితో డబ్బు సంపాదించారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్న వేళ, లోకేశ్ ఒక్క ట్వీట్ తో అన్ని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రే తాము డబ్బు సంపాదించలేదని, హెరిటేజ్ సంస్థను స్థాపించి 33 ఏళ్లు విజయవంతంగా నడిపామని, తమతో పాటు పాడి రైతులను అభివృద్ధి చేశామని లోకేశ్ ట్వీట్ చేశారు.

దేశంలో రాజకీయ నాయకుల ఆర్థిక పరిస్థితిపై రెండు రోజుల క్రితం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోకెల్లా ఎక్కువ సంపాదించిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శల దాడి ఎక్కువ చేశారు. అవినీతి, అక్రమాల వల్లే చంద్రబాబు సంపద కూడేసుకున్నారని వైసీపీ నేతలు విమర్శలతో విరుచుపడ్డారు. దీనికి కౌంటర్ గా తమ కుటుంబం ఎలా సంపాదించినదీ వివరిస్తూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

మేము రాత్రికి రాత్రే ఈ స్థితికి రాలేదు. మా ఎదుగుదల చరిత్రను చూస్తే మీకే అర్థమవుతోంది. 1992లో ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు యువ నాయకుడిగా ఉన్న చంద్రబాబు, పాడి రైతులకు ఎలా సహాయం చేయగలనో అని ఆలోచించారు. ఆ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, డెయిరీ రంగంలో ప్రైవేటుపెట్టుబడులకు అవకాశమిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా 100కి పైగాప్రైవేటు డెయిరీలు ప్రారంభమయ్యాయి. ఇలా చిత్తూరులో హెరిటేజ్ ఫుడ్స్ కు చంద్రబాబు ప్రాణం పోశారు.

రూ.50 లక్షల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ సహాయంతో హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభమైంది. చిత్తూరులో హెరిటేజ్ ఫుడ్స్ మొదటి మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఏర్పాటైంది. హెరిటేజ్ సంస్థకు తొలి రెండేళ్లు ఎండీగా పనిచేసిన చంద్రబాబు, 1994లో రాష్ట్ర మంత్రి అయిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి మా అమ్మ భువనేశ్వరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టరుగా హెరిటేజ్ సంస్థను చూసుకున్నారు. 1994లోనే హెరిటేజ్ కంపెనీ ఐపీవో ద్వారా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఆ తర్వాత సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోవిడ్ - 19 తర్వాత హెరిటేజ్ సంస్థకు ఉన్న అప్పులు అన్నీ తీరిపోయాయి. రుణ రహిత సంస్థగా కంపెనీతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, రైతులకు మనోధైర్యం ఇస్తున్నాం. పాడి రైతుల సంక్షేమం కోసం మా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డాంటూ లోకేశ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం మార్కెట్ విలువ రూ.4,400 కోట్లు, ఆదాయం రూ.3,750 కోట్లు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్న హెరిటేజ్ సంస్థ మొత్తం ఆస్తుల విలువే రూ.600 కోట్లు. ఇదంతా హెరిటేజ్ 33 ఏళ్ల ప్రయాణంలో సంపాదించినది. ఒక్క క్షణంలో అత్యంత ధనిక సీఎం అయిపోలేదు. 40 ఏళ్ల అనుభవం సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారంటూ తన ట్వీట్ లో లోకేశ్ తెలిపారు. ఏడు పదుల వయసులోనూ ఆయన కష్టపడి పనిచేస్తారని లోకేశ్ వివరించారు.

Tags:    

Similar News