ఈ సండే రచ్చంతా నరసరావుపేటలో!

నరసరావుపేటలో చోటు చేసుకున్న పరిణామాలు

Update: 2023-07-17 04:27 GMT

వారం సంగతి ఎలా ఉన్నా.. వారాంతం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక రాజకీయ ఉద్రిక్తతలు తెర మీదకు రావటం గడిచిన కొంతకాలంగా ఒక ఆనవాయితీగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నరసరావుపేటలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. పల్నాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అధికార వైసీపీకి.. విపక్ష టీడీపీకి మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో పట్టణం తీవ్రమైన టెన్షన్ నెలకొంది. తమపై వైసీపీ ఎమ్మెల్యేతో సహా నేతలు కర్రలతో దాడులు చేసినట్లుగా టీడీపీ నేతలు.. క్యాడర్ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా అధికార వైసీపీ మాత్రం తమను కవ్విస్తున్నారని మండిపడుతున్నారు.

ఇంతకీ ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలా మొదలయ్యాయి? అన్న విషయంలోకి వెళితే.. జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటి వద్ద ఉన్న ఒక స్థానికుడి ఇంటిపై వివాదం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన వారు చల్లా ఇంటి వద్ద ఉన్న వ్యక్తి ఇంటిని తమదంటే తమదంటున్నారు.

వైసీపీ వర్గీయులు ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటి వద్దకు వెళ్లి.. ఇంటి వివాదంతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అంతకంతకూ విషయం ముదిరి.. కర్రలు.. రాళ్లతో సుబ్బారావు.. అతని వర్గీయుల మీద దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఇంటి కిటికీలు.. ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. టీడీపీ ఇంఛారర్జి చదలవాడ అరవిందబాబుకు సుబ్బారావు జరుగుతున్న విషయాన్ని ఫోన్లో చెప్పగా.. ఆయన అక్కడకు చేరుకున్నారు.

అరవిందబాబు కారులో నుంచి బయటకు వస్తున్న సమయంలోనే.. వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడులకు పాల్పడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. టీడీపీ కార్యకర్తలు దాడిని నిలువరించే ప్రయత్నం చేయగా.. వీరిపై రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ క్యాడర్ పరుగులు తీస్తున్న వేళ.. వారిపై కర్రలతో వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

దీంతో నరసరావుపేట రణరంగంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్కడకు చేరుకోగా.. వైసీపీ వర్గీయులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా గాయపరిచినట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో అరవిందరాబాబు కారు డ్రైవర్ తలకు తీవ్రగాయమైంది.

ఆదివారం రాత్రి 7 గంటలకు గొడవ మొదలైనా.. ఇరువర్గాల్ని నిలువరించేందుకు పోలీసులు తగిన సంఖ్యలో రాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లు.. వాహనాలు ధ్వంసమై.. గాయాల బారిన పడిన వేళలో పోలీసులు వచ్చి హడావుడి చేసినట్లుగా చెబుతున్నారు. తొలుత టీడీపీ.. వైసీపీ వర్గీయుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులకు వైసీపీ వర్గీయుల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో వారు టీడీపీ వర్గీయుల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి.. లాఠీలు ఝుళిపించటంపై టీడీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సున్నిత అంశాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే.. పరిస్థితులు చేయి దాటిపోవటమే కాదు.. శాంతిభద్రతల సమస్య అంతకంతకూ ఎక్కువ కావటం ఖాయమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News